
ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు
చింతలపూడి: ఇటీవల వరి సాగులో ఖర్చులు బాగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా సకాలంలో వరినాట్లు పడటం లేదు. పోసిన నారు ముదిరిపోవడం, లేదా నారు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చును తగ్గించుకుని, కూలీల సమస్యను అధిగమించేందుకు దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తే పద్ధతిని ఆచరించడం మేలని చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకుడు వై సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో 18,384 హెక్టార్లల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 5,252 హెక్టారుల్లో వరి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయి.
రైతుకు లాభం
దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తడం వల్ల నారు పోయడం, నారు తీత, నాట్లు వేసే పని ఉండదు. ఈ విధానం వల్ల ఎకరాకు రైతులకు సుమారు రూ.3,500 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఎకరాకు 15–20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. మొక్కల మధ్య సాంద్రత ఉండటంతో ఎకరాకు 15 శాతం దిగుబడి పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవడం మాత్రమేకాక , వారం పది రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది.
సాగులో మెలకువలు
సాధారణంగా అన్ని రకాల నేలల్లో దమ్ము చేసి వరివిత్తే పద్ధతిని అవలంభించవచ్చు. చౌడు, ఆమ్ల, క్షార నేలలు మాత్రం ఈ విధానానికి అనుకూలం కావు. రకాన్ని బట్టి ఎకరాకు 10 నుండి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరిసాగు ఆలస్యమయ్యే పరిస్ధితుల్లో స్వల్పకాలిక వరి విత్తనాలను ఎంచుకోవడం మేలు. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, మరో 24 గంటలు మండెకట్టి దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం కాని, డ్రమ్ము సీడర్‌తో కాని విత్తుకోవాలి.
డ్రమ్ సీడర్‌తో
డ్రమ్ సీడర్‌తో లాగితే ఒకేసారి 8 వరుసల్లో విత్తనాలు పడతాయి. సాళ్ళ మధ్య 20 సెం.మీ, మొక్కల మధ్య 5–8 సెం.మీ ఎడంగా గింజలు పడతాయి. ప్రతి 16 వరసలకు ఒక అడుగు కాలిబాట వదలాలి. ఇద్దరు కూలీలు రెండు గంటల్లో ఎకరా విత్తనాలను విత్తవచ్చు.
ఎరువుల వాడకం
సాధారణ వరికి సిఫార్సు చేసిన విధంగానే దీనికి కూడ ఎరువుల వాడకం చేపట్టాలి. దమ్ములో మాత్రం నత్రజని ఎరువులు వేయకూడదు. వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. భాస్వరం, అర వంతు పొటాష్‌ను దమ్ములో వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసుకుని విత్తిన 15–20, 40–45, 60–65 రోజులకు వేయాలి. మిగిలిన సగభాగం పొటాష్ 60–65 రోజులకు నత్రజనితో పాటు వేసుకోవచ్చు.
నీటి వాడకం
విత్తిన దగ్గర నుండి పొట్ట దశ వచ్చే వరకు బురదగా ఉంచి పొట్టదశ నుంచి పంట కోత పది రోజుల ముందు వరకు పొలంలో 2 సెంమీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్ధ బాగా బలపడి పిలకలు బాగా వస్తాయి.
కలుపు నివారణ
కలుపు నివారణకు ఎకరాకు 35 గ్రాముల ఆక్సా డయార్జిల్ లేదా 400 మిల్లీ.లీ ప్రిటిక్లాక్లోర్ లేదా 100 గ్రా పైరజో సల్ఫ్యూరాన్ మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిపి విత్తిన 3–5 రోజుల మధ్య పొలంలో పలుచగా నీరుంచి చల్లాలి. విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా ఉంటే ఎకరాకు 80–100 మి.లీ బిస్‌ఫైరిబాక్ సోడియం, ఊద ఎక్కువగా ఉంటే 300–400 మి.లీ సైహలోఫాప్ బ్యూలైట్‌ను, వెడల్పాటి ఆకు ఎక్కువగా ఉంటే 4డి సోడియం లవణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
వై.సుబ్బారావు, చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకులు

ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు

ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు

ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు