
రుణాలు అందక ఇబ్బందులు
భీమవరం: రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సొసైటీ) పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీలు, ప్రత్యేక అధికారులు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించకపోగా ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసిన సంఘాలకు అధికారులను నియమించకపోవడంతో సొసైటీలో రైతులు రుణం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 122 సొసైటీలున్నాయి. రైతులు ఎక్కువ శాతం సొసైటీల్లో రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులు పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీరో వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇవ్వడంతో సొసైటీల ప్రాచుర్యం బాగా పెరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొసైటీలకు నియమించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటీవల కేవలం 50 సొసైటీలకు మాత్రమే త్రిసభ్య కమిటీలు నియమించారు. కూటమిలో పదవులు పందేరంలో తమకు ఎక్కువ శాతం పదవులు కావాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పంతాలకు పోవడంతోపాటు ఆయా సొంత పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తంతో నామినేటెడ్ పదవుల భర్తీ సందిగ్ధంగా మారింది.
ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన
జిల్లాలో కేవలం 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం, మిగిలిన సొసైటీల ప్రత్యేక అధికారుల పాలన జూలై 31తో ముగియడంతో పాలకవర్గాలు లేని దాదాపు 70 సొసైటీల్లోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొసైటీల్లో రుణాలు ఇవ్వాలంటే రుణం పొందే రైతుల జాబితాపై సంఘం చైర్మన్‌గాని ప్రత్యేక అధికారి సంతకం తప్పనిసరి. ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగించకపోవడంతో రైతులు రుణాలు ఎలా పొందాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సార్వా సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో కమిటీలను నియమించకపోవడం రైతులు పూర్తి స్థాయిలో రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీల్లో పూర్తి స్థాయిలో లేని త్రిసభ్య కమిటీలు
ఇంత వరకు 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం