
వర్షాకాలంలో పాముకాటుతో జాగ్రత్త
బుట్టాయగూడెం: వర్షాకాలంలో గ్రామాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో పచ్చని గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పశువులు బీడు భూములు, ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మేతకు వెళ్ళినప్పుడు పశువుల పాక చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో వర్షాల కారణంగా పచ్చని గడ్డిలో విషసర్పాలు ఉండి పశువులను కాటు వేసే ప్రమాదం ఉంది. పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీలుగుమిల్లి పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ మల్లంపల్లి సాయిబుచ్చారావు సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముకాటు నుంచి పశువులను కాపాడుకోవచ్చన్నారు.
రక్తపింజర
పశవులను రక్తపింజర కాటువేస్తే హీమోటాక్సిన్ విడుదలై రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో పశువు నోరు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. పాము కాటు వేసినచోట వాపు వచ్చి చర్మం రంగు మారుతుంది. మూత్రం ఎరుపురంగులోకి వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే 10 గంటలలోపు పశువులు మృత్యువాత పడతాయి.
తాచు, కట్ల పాములు
తాచు, కట్లపాములు పశువులను కాటు వేసినప్పుడు న్యూరోటాక్సిన్ వాటి శరీరంలోకి వెళ్ళి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో శ్వాస వ్యవస్థ స్థంభిస్తుంది. నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. సరైన సమయంలో చికిత్స అందించకపోతే పశువు మృతి చెందుతుంది.
విషరహిత పాముల్లో కాటు లక్షణాలు
విషరహిత పాములు కాటు వేసినప్పుడు రెండు వరుస పళ్లు ముద్రలు ఉంటాయి. గాయాలు చిన్నగా ఉంటాయి. ఎక్కువగా పలుచని రేఖల వంటి ముద్రలుగా ఉంటాయి. కొద్దిగా రక్తం కారవచ్చు. కానీ ఇది ప్రమాదమైన స్థాయిలో ఉండదు.
విషపూరిత పాము లక్షణాలు
విషపూరిత జాతి పాములు కాటు వేసిన చోట ఉబ్బినట్టు, గాయంలా కనిపిస్తుంది. పశువు తినకుండా నీరసంగా ఉంటుంది. అదుపు తప్పడం(పిచ్చెక్కినట్టుగా అటూ ఇటూ తిరగడం), నోట్లో నురగరావడం, వేగంగా గుండె చప్పుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, పొట్ట ఉబ్బడం, కింద పడి కాళ్లు కొట్టుకోవడం వంటివి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 గంటల్లోపు కాటుకు గురైన పశువులు మృతి చెందుతాయి.
వైద్యుల సూచనలు
● పాముకాటుకు గురైన పశువులను బయటకు పంపించవద్దు. ఎక్కువగా నడిపించకూడదు. కదలకుండా ఉండాలి.
● కాటు వేసిన ప్రాంతానికి పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఇది పాము విషాన్ని నరాల ద్వారా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. 15 నిముషాలకు ఒకసారి నిమిషం పాటు విరమించాలి. లేదంటే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
● కాటు వేసిన చోట కడగవద్దు. కట్టు తియ్యొద్దు. ఇలా చేస్తే విషం వ్యాప్తి పెరుగుతుంది.
● పశువులను బాగా గాలి తగిలేటట్టు నీడలో ఉంచాలి.
● వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి పశువులను కాపాడుకోవచ్చు.
సకాలంలో చికిత్స అందించాలి
పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు తరచూ గమనించాలి. పాము కాటు వేస్తే కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టాలి. బ్లేడుతో కోసి రక్తం పిండాలి. 15 నిముషాలకు ఒకసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. స్నేక్ యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఆట్రోసిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్‌ను పశువు రక్తంలోకి ఎక్కించాలి. నొప్పి నివారణకు స్టైరాయిడ్, యాంటీ బయోటిక్స్, అవసరాన్ని బట్టి ఇతర మందులను ఇవ్వాలి.
డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జీలుగుమిల్లి

వర్షాకాలంలో పాముకాటుతో జాగ్రత్త