
గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఆగేనా?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు కాలువ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం కాలువ గట్టుపై నుంచి గ్రామంలోకి వెళ్లే పలు మార్గాల్లో ట్రంచ్ (రోడ్డుకు అడ్డంగా) తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే. కొందరు టీడీపీ నాయకులు కాలువ గట్టును ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో దొంగతనంగా గ్రావెల్ తవ్వకాలను జరిపి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో నాయకుడు ఈ మట్టిని అమ్ముకోవడం ద్వారా నెలకు రూ. 3 లక్షల వరకు కూడబెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ పచ్చ ముఠా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, ఏకంగా భూమిని తవ్వి గ్రావెల్‌ను అమ్మేస్తున్నారు. దాంతో కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి, అగాధాలను తలపిస్తున్నాయి. అవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం సంబంధిత శాఖల అధికారులకు ప్రహసనంగా మారింది.
దొంగ దారుల్లో ట్రంచ్‌లు..
మట్టి దొంగలు అధికార పార్టీకి చెందినవారు కావడంతో కొందరు అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దాంతో వారి మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు.. జేసీబీలతో కాలువ గట్టుపైకి చేరి, తవ్వకాలు జరిపేస్తున్నారు. వీరి తవ్వకాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలువ ఇరిగేషన్ అధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకునేందుకు కాలువ గట్టు చివరన కాపలా కాస్తున్నారు. అయితే తెలివిమీరిన మట్టి దొంగలు పలు దొంగ మార్గాల గుండా మట్టిని తరలించేస్తున్నారు. దాంతో కాపలా కాసినా ప్రయోజనం లేదని భావించిన అధికారులు ట్రంచ్ తవ్వకాలను చేపట్టారు. గట్టుపై నుంచి గ్రామంలోకి అక్రమ మట్టి రవాణా జరుగుతున్న పలు మార్గాలను గుర్తించి, పీఐపీఆర్‌ఎంసీ జేఈ దూర్జటి పర్యవేక్షణలో ట్రంచ్ లను తవ్వారు.
ఫలితం ఉంటుందా?
ట్రంచ్‌లు తవ్వడం వల్ల ఫలితం ఉంటుందా అంటే.. గ్రామస్తులు కొందరు ఉండదనే అంటున్నారు. మట్టినే ఆదాయ వనరుగా ఎంచుకున్న ముఠాకు ట్రంచ్‌లు ఒక లెక్క కాదని చెబుతున్నారు. ట్రంచ్‌లను పూడ్చి, అక్రమ రవాణాను సాగించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే అధికారుల ప్రయత్నం ఏమేరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న
ఇరిగేషన్ అధికారులు
పలు మార్గాల్లో ట్రంచ్‌ల తవ్వకాలు