
సేంద్రియ సాగుతో ఖర్చు ఆదా
చింతలపూడి: రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని, సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గి లాభాలు చేకూరుతాయని తెలిపారు.
సేంద్రియ ఎరువులు అంటే
సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు ముఖ్యమైనవి. వీటి వాడకం వల్ల భూమి సహజ స్థితిని పొందడమే కాక, పంటకు ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. నాణ్యమైన, విష రహితమైన పంటలను పండించవచ్చు. వీటితో పాటు వేరుశనగ, వేప, పొద్దు తిరుగుడు, ఆముదం చెక్కలను వాడడం వలన మొక్కలకు పోషక పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి.
పచ్చిరొట్ట ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రధానమైనవి. పచ్చి రొట్టతో వివిధ పంటల్లో దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. పచ్చిరొట్టలో జీలుగ, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము ముఖ్యమైనవి.
జీవ ఎరువులు: పంటల పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించే సూక్ష్మ జీవకణాల సముదాయాలను జీవన ఎరువులు అంటారు. వీటిలో నత్రజనిని స్థిరీకరించేవి రైజోబియం, నీలి ఆకుపచ్చ ఆకు, అజిటో బ్యాక్టీరియ, అజో స్పైరిల్లం, అజొల్లా ఒక రకం కాగా, భాస్వరంను భూమిలో లభ్యమయ్యేలా చేసే ఫాస్ఫో బ్యాక్టీరియ రెండోది.
నీలి ఆకుపచ్చ నాచు: ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు వేయాలి. 7–10 రోజుల మధ్య మడిలో నీరు పెట్టాలి. నాచు గాలిలోని నత్రజనిని తీసుకుని స్థిరీకరిస్తుంది. దీనివలన ఎకరాకు 8–12 కిలోల నత్రజని పంటకు అంది దిగుబడి పెరుగుతుంది.
అజటో బ్యాక్టర్: ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చరును పట్టించాలి. లేదా కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. వరి, చెరకు, జొన్న, పత్తి, సజ్జ, మిరప పంటల్లో వేసుకుంటే మంచిది. దీని వల్ల ఎకరానికి 8–16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది.
అజొల్లా: దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను వేసి పలుచగా నీరు పెట్టి 100–150 కిలోల అజొల్లా వేసి 2–3 వారాల తరువాత నేలలో కలియ దున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టతో 12 కిలోల నత్రజని అందుతుంది.
భాస్వరపు జీవన ఎరువు: ఫాస్ఫో బ్యాక్టీరియ భూమిలో లభ్యంకాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంలో 200–400 గ్రాముల కల్చర్‌ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి. ఇక రైతులు రసాయనిక ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని, అధిక మోతాదులో వాడితే పురుగులు, తెగుళ్లు అధికమై పంట దెబ్బతినే ప్రమాదం ఉందని సుబ్బారావు తెలిపారు.
వై సుబ్బారావు, వ్యవసాయ సహాయ సంచాలకులు

సేంద్రియ సాగుతో ఖర్చు ఆదా