
అంగన్‌వాడీ.. సమస్యల ఒడి
సాక్షి, భీమవరం: ఆటపాటలతో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే అంగన్‌వాడీ కేంద్రాలు కూటమి సర్కారు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆట పరికరాల సరఫరా లేక పిల్లలు పాడైపోయిన బొమ్మలతోనే ఆడుకోవాల్సిన దుస్థితి. సన్నబియ్యం రాక ముతక బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వస్తోందని అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు.
1,556 కేంద్రాలు.. 70 మినీ కేంద్రాలు
జిల్లాలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,626 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆయాలతో నడిచే మినీ కేంద్రాలు 70 ఉండగా, వర్కర్, ఆయాలతో నిర్వహించే కేంద్రాలు 1,556 ఉన్నాయి. వీటి పరిధిలో 7,936 మంది గర్భిణులు, 5,686 మంది బాలింతలు, ఏడు నెలల వయసు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 40,706 మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు బాలలు 17,687 మంది ఉన్నారు.
ముతక బియ్యమే సరఫరా
గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు ఆయిల్ ప్యాకెట్, ఐదు లీటర్ల పాలు, 25 గుడ్లు, కిలో అటుకులు, రెండు కిలో రాగి పిండి, పావు కిలో డ్రైఫ్రూట్స్ తదితర వాటిని అందజేయాలి. గర్భిణులు, బాలింతలకు పోర్టిఫైడ్ బియ్యం సరఫరాను గత వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే ప్రారంభించారు. అలాగే చిన్నారులకు సోమవారం నుంచి శనివారం వరకు రోజూ అంగన్‌వాడీ కేంద్రాల వద్దనే ఆహారాన్ని అందించాలి. మెనూ ప్రకారం సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో అన్నం, కూరలతో భోజనం, మంగళవారం పులిహోరా, శనివారం వెజిటబుల్ రైస్ వడ్డించాలి. హాస్టళ్లు, పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినట్టు చెబుతున్న కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం రేషన్ డిపోల్లో అందజేసే బియ్యాన్నే సరఫరా చేస్తుండటం గమనార్హం. అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతుండగా తమకు రేషన్ బియ్యమే వస్తున్నాయని వర్కర్లు చెబుతున్నారు. చిన్నారులకు ఆటపరికరాలతో పాటు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో..
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేంద్రాల్లో వసతుల కల్పన, నూ తన భవనాల నిర్మాణం, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు తదితర వసతులు కల్పించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రా ధాన్యమిస్తూ పౌష్టికాహారం మెనూలోనూ మార్పులు చేసింది. చిన్నారుల వికాసానికి క్రమం తప్పకుండా ఆటపరికరాలు సరఫరా చేస్తూ వచ్చింది.
పాడైపోయిన బొమ్మలే దిక్కు
చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఆటపరికరాలు దోహదపడతాయి. వారు ఆరోగ్యంగా ఎదగేందుకు సాయపడతాయి. పిల్లల ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంచే బొమ్మలు, ఆట వస్తువులు, రంగురంగుల బ్లాక్లు, పజిల్స్, లెక్కలు నేర్చుకునేందుకు సంబంధించిన వస్తువులు, పిల్లలు కలిసి ఆడుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటానికి ఉపయోగపడే ఆట వస్తువులు తదితర వాటితో కూడిన ఆట పరికరాల కిట్లను ప్రభుత్వం సరఫరా చేసేది. గతంలో రెగ్యులర్‌గా వచ్చేవని రెండేళ్లుగా ఆట పరికరాల కిట్లు సరఫరా నిలిచిపోయినట్టు అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు. కొత్తవి రాకపోవడంతో గత ప్రభుత్వంలో అందజేసిన ప్లాస్టిక్ బొమ్మలు, పరికరాలతోనే ప్రస్తుతం చిన్నారులు ఆడుకుంటున్నారు. వీటిలో చాలా వరకు పాడైపోయి విరిగిపోయాయి. కొన్ని సెంటర్లలో ఈ బొమ్మలు సైతం లేని పరిస్థితి ఉంది. కాగా ఆట పరికరాల కోసం ప్రతిపాదనలు పంపామని, కిట్లు రావాల్సి ఉందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు.
ఆట బొమ్మలకూ దిక్కులేదు
అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట పరికరాలు సరఫరా చేయని కూటమి సర్కారు
పాడైపోయిన వాటితోనే పిల్లలకు ఆటలు
సన్నబియ్యం రాక చౌక బియ్యమే పంపిణీ
జిల్లాలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాలు
ఐదేళ్లలోపు చిన్నారులు 58,393
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు పెద్దపీట

అంగన్‌వాడీ.. సమస్యల ఒడి

అంగన్‌వాడీ.. సమస్యల ఒడి