
తేనెటీగల పెంపకంతో ఆర్థిక వృద్ధి
తాడేపల్లిగూడెం: తేనె టీగల పెంపకంతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని సీనియర్ సైంటిస్టు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో గురువారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తేనెను శాసీ్త్రయంగా ఎలా ప్రోసెస్ చేయాలి, నాణ్యమైన తేనెను మిషనరీ ద్వారా కలుషితం లేకుండా బాట్లింగ్ వరకు ఎలా తీసుకురావాలనే విషయాలను విశదీకరిరంచారు. రూ.20 వేలతో ఒక ఎకరానికి నాలుగు బాక్సులు, రూ.5 వేలతో కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి ఉద్యాన పంటల మధ్య ఖాళీ స్థలంలో బాక్సులు ఎలా అమర్చాలనే విషయాల గురించి చెప్పారు. తేనె ఉప ఉత్పత్తులుగా మైనం, పుప్పొడి, జెల్లీ, విషం తయారు చేసి ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందవచ్చన్నారు. గాఢమైన పురుగుమందులు కొట్టే తోటల పక్కన కాని, రైల్వే ట్రాకుల పక్కన, విద్యుత్ స్తంభాల పక్కన తేనెటీగల పెంపకం కోసం బాక్సులు ఏర్పాటు చేయకూడదన్నారు. మూడు రోజుల పాటు శిక్షణలో తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, నివారణ చర్యలు గురించి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దీప్తి, దేవీవరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: విద్యుత్ స్తంభాన్ని మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దండే శ్రీను (21) గురువారం బాదంపూడి నుంచి స్వగ్రామం మోటారు సైకిల్‌పై వస్తుండగా, నవాబుపాలెం వద్దకు వచ్చే సరికి కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను సోదరుడు చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.