
మార్టేరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తకు పురస్కారం
పెనుమంట్ర : మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై సునీతను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవంలో ఉత్తమ అవార్డుతో సత్కరించారు. ఈ నెల 24వ తేదీన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరులో సస్య ప్రజనన విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డా. వై. సునీత 2011 నుంచి చేసిన విశిష్ట సేవలకు గాను ‘మెరిటోరియస్ రీసెర్చ్ సైంటిస్ట్ అవార్డు’ అందుకున్నారు. ఆమె మార్టేరు (18 రకాలు), బాపట్ల (5 రకాలు) వరి పరిశోధనా స్థానాల నుంచి మొత్తం 23 వరి రకాల అభివృద్ధి, విడుదలలో భాగస్వామిగా ఉన్నారు. అదనంగా 1 జన్యు స్టాక్ అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు డీడీఆర్. డా. టి. శ్రీనివాస్, ఇతర శాస్త్రవేత్తలు, సిబ్బంది అవార్డు గ్రహీతకు అభినందనలు తెలిపారు.