ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

Aug 1 2025 5:52 AM | Updated on Aug 1 2025 5:52 AM

ప్రైవ

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

కై కలూరు: రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏలూరు జిల్లాలో కలిదిండి, కై కలూరు రెండు మండలాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆక్వా రంగం. ఆక్వా ఉత్పత్తుల రవాణాలోనూ కొల్లేరు ప్రాంతాలు సింహభాగం ఆక్రమించాయి. ఆక్వా ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర మంచినీటి సంవర్థక రిఫరల్‌ ల్యాబోరేటరీను కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కాకినాడ తర్వాత కై కలూరు ల్యాబ్‌ మాత్రమే రాష్ట్ర స్థాయిలో రిఫరల్‌ ల్యాబ్‌ కావడం విశేషం. కూటమి ప్రభుత్వంలో ఈ ల్యాబ్‌ పాడుపడ్డా కొంపలా మారింది. కేవలం ఒకే ఒక్క సిబ్బంది పరీక్షలు నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వ ఆక్వా ల్యాబ్‌లో సేవలు సక్రమంగా అందకపోవడంతో రైతులు ప్రైవేట్‌ ఆక్వా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.

పరికరాలున్నా.. ప్రయోజనం శూన్యం

కై కలూరులో మత్స్యశాఖ కార్యాలయంతో పాటు లాబోరేటరీని 2003లో నిర్మించారు. ఫీడ్‌ అనాలసీస్‌, మైక్రోబయోలజీ ల్యాబ్‌ను దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో అప్పటి మంత్రి ఎండీ.ఫరీదుద్దిన్‌ 2005లో ప్రారంభించారు. ల్యాబ్‌లో మైక్రోబయోలజీ, హిస్టోపాథాలజీ, నీటి, మట్టి, మేత పరీక్షలు, పీసీఆర్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్‌లో రూ.20లక్షల విలువ చేసే ఎలిషా పరికరం, అదే విధంగా రూ.13లక్షలు విలువ చేసే పీసీఆర్‌ మిషన్‌తో పాటు మేత పరీక్షలకు రూ.లక్షల్లో విలువ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్‌లతో పోల్చితే తక్కువ ధరకు పరీక్షలు చేస్తున్నా ఆక్వా రైతులు ఫిషరీస్‌ ల్యాబ్‌కు రావడం లేదు.

లైసెన్సులు లేనివి ఎన్నో..

ఆక్వా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ(అప్సడా) నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కోస్టల్‌ అథారిటీ అనుమతులు ఉండాలి. వీటితో పాటు డ్రగ్‌ లైసెన్స్‌, జీఎస్టీ, ఐటీ రిటర్న్‌, ఆథరైజ్డ్‌ డీలర్‌షిప్‌ లెటర్స్‌తో దరఖాస్తు చేసుకున్న తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ అనుమతులు పొందాలి. క్షేత్ర స్థాయిలో తహసీల్దార్‌, ఫిషరీస్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పొల్యూషన్‌ ఇలా పలు శాఖలు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వాలి. ఇంత తతంగం ఉన్నప్పుటికీ కై కలూరు నియోజకవర్గంలో ఏకంగా 130 ఆక్వా దుకాణాలు ఉన్నాయి. వీటిలో కేవలం 39 దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి.

కూటమి ప్రభుత్వంలో రెక్కలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లైసెన్సులు రాకపోయినా రాజకీయ నేతల అండతో ఆక్వా దుకాణాలు తెరుస్తున్నారు. కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లలో సరైన నిబంధనలు పాటించడం లేదు. ఇక పరీక్ష ధరల విషయానికి వస్తే ప్రభుత్వ ల్యాబ్‌లో నీటి పరీక్ష రూ.100 ఉంటే ప్రైవేటు ల్యాబ్‌లో రూ.200, మట్టి పరీక్ష రూ.210 ఉంటే ప్రైవేటులో రూ.300, మేతలో అన్ని పరీక్షుల కలిపి ప్రభుత్వ ల్యాబ్‌లో రూ.680 ఉంటే ప్రైవేటులో రూ.1200, పీసీఆర్‌ టెస్టు ప్రభుత్వ ల్యాబ్‌లో రూ.800 ఉండగా ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.2,500 తీసుకుంటున్నారు. ఇక కొన్ని ఆక్వా దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి చెరువులో చల్లడం వల్ల సాగు రైతులకు రూ.లక్షల్లో చేప పిల్లలు చనిపోతున్నాయి. నాసిరకం మందులపై ప్రశ్నిస్తే రాజకీయ నేతల అండతో బక్క రైతులపై దుకాణదారులు జులం ప్రదర్శిస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ పాలనలో

రూ.18.60 లక్షలు నిధుల కేటాయింపు

వైఎస్సార్‌ సీపీ పాలనలో ల్యాబ్‌ ఆధునికీకరణకు రూ.18.60 లక్షలు కేటాయించారు. పరికరాలు కొనుగోలుతో పాటు ఎంజైమ్‌ లింక్ట్‌ ఇమ్యునోసోర్జెంట్‌ ఆస్సే(ఎలిషా) టెస్టు గదిని నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సిబ్బందిని నియమించకపోవడంతో మూతపడింది. ల్యాబ్‌లో మొత్తం 6గురు సిబ్బందికి గాను కేవలం అశోక్‌ అనే ఎంపీఈవో సిబ్బంది ఒక్కరే పరీక్షలు చేస్తున్నాడు. ఇక్కడ ల్యాబ్‌ ఏడీ రాజ్‌కుమార్‌ను ఏలూరు ఏడీగా వేయడంతో అయన అక్కడ సేవలకే పరిమితమయ్యారు. గత పాలనలో సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా ఇక్కడ మత్స్య సహాయకులను పరీక్షలకు నియమించారు. ఇప్పుడు వీఎఫ్‌ఏలు సచివాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నారు.

కూటమి హయాంలో ప్రభుత్వ ల్యాబ్‌ నిర్వీర్యం

పరికరాలు ఉన్నా.. సేవలు శూన్యం

సచివాలయాలకే పరిమితమవుతున్న వీఎఫ్‌ఏలు

పెచ్చులూడటం వాస్తవమే

కై కలూరు ఆక్వా లేబోరేటరీ బయట శ్లాబ్‌ పెచ్చులూడడం వాస్తవమే. ఇంజనీరింగ్‌ అధికారులకు తెలిపాం. ఎలిషా టెస్టుకు కాకినాడలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. ఆక్వా దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్షేత స్థాయిలో అధికారుల లాగిన్‌లో నిలిచాయి. దుకాణాల్లో, లేబ్‌లలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – బి.రాజ్‌కుమార్‌, మత్స్యశాఖ ల్యాడ్‌, ఏడీ, కై కలూరు

పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి

ఫిషరీస్‌ ల్యాబ్‌ను రైతులకు అందుబాటులో ఉంచండి. సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ల్యాబ్‌ ఉన్నప్పటికీ ఆక్వా రైతుల నమ్మకాన్ని పొందలేకపోతుంది. ప్రభుత్వం ల్యాబ్‌కు మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి.

– సమయం రామాంజనేయులు, ఆక్వా రైతు, కై కలూరు

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు 1
1/5

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు 2
2/5

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు 3
3/5

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు 4
4/5

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు 5
5/5

ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement