
ఆటో, వ్యాన్ ఢీకొని కూలీ మృతి
నలుగురికి గాయాలు
దెందులూరు: ఆటోను వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక కూలీ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర, మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రులో గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రావులపాలెం నుంచి మండవల్లి రొయ్యల చెరువు పట్టుబడికి కూలీలు ఆటోలో వస్తున్నారు. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి ఆటో, భీమవరం నుంచి వస్తున్న వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. ఆటోలో ఉన్న ఒరిస్సా రాష్ట్రం దేవిరీపల్లికి చెందిన సందీప్ కుమార్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితావారిలో ఒరిస్సాకు చెందిన రాత్‌కు, సూరజ్‌కు తీవ్రగాయాలు కాగా రాంబాబు, లక్ష్మణ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ తహసీల్దార్ బి విజయకుమార్‌రాజు, శ్రీపర్రు వీఆర్‌ఓ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.