నర్సంపేట రూరల్ : సమాజంలో ప్రతి పౌరుడికి చట్టాలపై అవగాహన ఉండాలని, చట్టాలే ఖైదీల పునరావాసానికి తొలిమెట్టు అని నర్సంపేట కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ యూసుఫ్ పేర్కొన్నారు. నేరాల నుంచి విముక్తిపొంది సమాజంలో మంచి పౌరులుగా జీవించాలనే ఉద్దేశంతో నర్సంపేట మహిళా ప్రత్యేక కారాగారంలో జైలు సూపరింటెండెంట్ స్రవంతి అధ్యక్షతన మండల న్యాయ సేవాధికార సంస్థ (ఎంఎల్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో న్యాయ సేవా విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి యూసుఫ్, జైలర్ స్రవంతితో కలిసి మహిళా ఖైదీల సమక్షంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక కారణాలతో న్యాయం పొందలేని పేదలకు, మహిళలకు చట్టబద్ధమైన సమాన న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. మహిళా ఖైదీలకు , వివిధ చట్టాలు కల్పించిన ప్రత్యేక హక్కులు, కోర్టుల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందే పద్ధతులను న్యాయమూర్తి వివరించారు. ఖైదీలు గతాన్ని విడిచి, జైలు జీవితాన్ని ఒక ఆత్మపరీశీలన వేదికగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విజిటింగ్ అడ్వకేట్లు సునీత, దివ్య పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా ఎదగాలి:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్
కార్యదర్శి ప్రతీక్ సిహాగ్
కాశిబుగ్గ : జువైనల్ హోమ్‌లోని బాలలు తమ తప్పును సరిదిద్దుకుని బాధ్యతాయుతంగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్ కార్యదర్శి, న్యాయమూర్తి ప్రతీక్ సిహాగ్ సూచించారు. సోమవారం వరంగల్ ఆటోనగర్‌లోని ప్రభుత్వ బాలుర పరిశీలక గృహంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమ్‌లో ఉన్న బాలలకు న్యాయ విజ్ఞానం, వారి హక్కులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరికి చట్టం సమాన అవకాశాలు, రక్షణ కల్పిస్తోందన్నారు. హోమ్‌లోని వసతులు, పరిశుభ్రత, అందుతున్న భోజన, వైద్య సదుపాయాలను పరిశీలించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆర్.సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.రజని, హోమ్ సూపరింటెండెంట్ శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి
మహమ్మద్ యూసుఫ్


