అరెస్టుల పరంపర.. పరారీలో నిందితులు..
కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాలపై సీఐడీ కొరడా..
సాక్షిప్రతినిధి, వరంగల్:
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అక్రమాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించి, సన్న బియ్యం సరఫరా చేయాల్సిన చోట దొడ్డు బియ్యం పంపించినట్లు వచ్చిన ఆరోపణలపై వరుసగా తనిఖీలు, అరెస్టులు చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఇప్పటికే 9 రైస్ మిల్లులకు సంబంధించి 23 మందిపై కేసులు నమోదు కాగా.. పలువురిని సీఐడీ వరంగల్ డీఎస్పీ వాసం సంపత్ బృందం అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మరో 14 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు తనిఖీల పరిధిని విస్తరిస్తూ మరో 6 మిల్లులకు అధికారులు నోటీసులు జారీ చేయడం మిల్లర్లలో కలకలం రేపుతోంది. కాగా, త్వరలోనే హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ ధాన్యం అక్రమాలపై తనిఖీలు, అరెస్టుల పరంపర కొనసాగనుందని సమాచారం.
ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాలు..
రెండో విడత తనిఖీల్లోనూ అదే పరిస్థితి..
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల రైస్‌మిల్లర్లు గత రబీ సీజన్‌కు సంబంధించి 1,25,737 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు 47,675 (37.92 శాతం) మెట్రిక్ టన్నులే చెల్లించారు. అక్టోబర్ 31కే గడువు ముగిసినా ఇంకా 78,062 టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు ములుగు జిల్లాలోని 6 రైస్ మిల్లుల్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు లేనట్లు గుర్తించారు. రికార్డుల్లో ఉన్న నిల్వలకు, క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యానికి మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. సీఎంఆర్ కింద మరో 6,700 క్వింటాళ్ల సన్న బియ్యం ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉండగా.. వాటి స్థానంలో దొడ్డు బియ్యం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ అధికారులు రెండో విడత తనిఖీలు చేపట్టగా మరో మూడు మిల్లుల్లో సుమారు నాలుగు వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు కనిపించలేదని సమాచారం. దీంతో ఇప్పటివరకు తనిఖీలు జరిగిన మిల్లుల్లో ధాన్యం నిల్వల గల్లంతు, బియ్యం రకం మార్పిడి వ్యవహారం మరింత విస్తృతంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ధాన్యం ఎక్కడికి తరలించారు? బహిరంగ మార్కెట్లో విక్రయించారా? సీఎంఆర్ బియ్యం బదులు ఇతర ప్రాంతాల నుంచి దొడ్డు బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
ములుగు జిల్లాలో అక్టోబర్ 25 నుంచి సీఐడీ అరెస్టుల పర్వం ప్రారంభమైంది. రైస్ మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌తో పాటు పలువురు మిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంఘం అధ్యక్షుడు కాట్రగడ్డ సతీశ్ సహా మరికొందరిపై చర్యలు చేపట్టారు. తాజాగా, మరికొందరు మిల్లర్ల అరెస్టులతో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. కేసుల్లో నిందితులుగా ఉన్నవారిలో కొందరు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండగా.. పరారీలో ఉన్నవారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే 9 మిల్లులపై కేసులు నమోదు చేసిన సీఐడీ.. మరో 6 మిల్లుల్లో తనిఖీలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సంబంధిత మిల్లర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ధాన్యం కేటాయింపులు, సీఎంఆర్ బకాయిలు, స్టాక్ రిజిస్టర్లు, రవాణా పత్రాలు, ఎఫ్‌సీఐకి పంపిన బియ్యం నమూనాలను పరిశీలించనున్నారు. అవసరమైతే పౌరసరఫరాల శాఖ అధికారుల పాత్రపైనా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ధాన్యం కేటాయింపుల నుంచి మిల్లింగ్, బియ్యం సరఫరా వరకు ప్రతి దశలోని రికార్డులను సీఐడీ పరిశీలిస్తోంది. నిల్వల లెక్కలు, ధాన్యం రవాణా, బియ్యం నాణ్యత పరీక్షలు, సీఎంఆర్ ఒప్పందాల ఆధారంగా అక్రమాల పరిమాణాన్ని నిర్ధారించనున్నారు.
గడువు ముగిసినా రబీ సీఎంఆర్ ఇప్పటికీ 37.92 శాతమే
ములుగులో 9 మిల్లులు.. 23 మంది నిందితులు
సన్నబియ్యం పేరిట దొడ్డు బియ్యం సరఫరా..
పలు మిల్లులకు నోటీసులు
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ
త్వరలో అరెస్టులు


