హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయ సమీపంలోని కీర్తి గార్డెన్స్‌లో మంగళ, బుధవారాల్లో ధార్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచించనున్నారు. ఈ మేరకు విద్యారణ్య ఆర్ష ధర్మరక్షణ సంస్థ వరంగల్ బాధ్యులు ఏర్పాట్లు చేశారు. సోమవారం మధ్యాహ్నం చాగంటి కోటేశ్వరరావు వరంగల్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ష ధర్మరక్షణ సంస్థ అధ్యక్షుడు నకిరేకంటి రామమూర్తి, కార్యదర్శి పోలా పశుపతి, సభ్యులు తదితరులు ఆయనను ఘనంగా స్వాగతించారు.
హసన్‌పర్తి: 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–26కు వేదిక సిద్ధమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు క్రీడలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. హనుమకొండలోని జేఎన్ స్టేడియం, కిట్స్ కళాశాల మైదానం, భీమారంలోని ఎస్‌వీఎస్ కళాశాల గ్రౌండ్‌లో పోటీలకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా 1,535 మంది పోలీస్ క్రీడాకారులు ఈపోటీల్లో పాల్గొననున్నట్లు కమిషనర్ శ్వేత తెలిపారు.
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈనెల 23 వరకు పరీక్షలు కొనసాగుతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. అధ్యాపకులు డాక్టర్ అంజన్‌రావు, డాక్టర్ జితేందర్, సుధీర్ పాల్గొన్నారు.
కాశిబుగ్గ: తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేఎంసీ యూనిట్‌కు జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకున్నారు. సోమవారం ఎంజీఎంలో నూతన కమిటీ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. జనరల్ కౌన్సిల్ సభ్యులుగా జనరల్ సర్జరీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ వి.శ్రీనివాస్‌గౌడ్, ఈఎన్‌టీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ సంపత్‌రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.నవీన్, జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.సుశాంత్, ఆర్‌ఈహెచ్ ఆఫ్తాల్మజీ ప్రొఫెసర్ చంద్రభాను, ఆర్‌ఈహెచ్ ఆఫ్తాల్మజీ ప్రొఫెసర్ హరిదేవ్ కుమార్, హనుమకొండ ప్రసూతి వైద్యశాల గైనకాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.శిరీష, ఆర్‌ఈహెచ్ ఆఫ్తాల్మజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.సవిత, కేఎంసీ ఎస్‌పీఎం ప్రొఫెసర్ ఎల్.మురళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అంబి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి.చిన్నికృష్ణ, కోశాధికారి చాడా రమేశ్ తెలిపారు.
వరంగల్ అర్బన్: ఇన్‌చార్జ్ అడిషనల్ కమిషనర్‌గా నియమితులైన సమ్మయ్య సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి.వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈసందర్భంగా కమిషనర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కమిషనర్ జోనా ఉద్యోగ విరమణతో ఖాళీ ఏర్పడింది. సీనియర్ అధికారి సమ్మయ్యకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.


