హన్మకొండ అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాలతో రద్దు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఐనవోలు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ (గౌరీ) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్యాహ్నికం ప్రాతఃకాల అర్చన, త్రిపురోపనిషత్, దేవ్యుపనిషత్ పారాయణాలు, ఆవరణ పూజ, సువాసిని పూజ, శ్రీ సూక్తపారాయణం తదితర కార్యక్రమాలు విశేషంగా జరిపించారు. మహానివేదన, నీరాజన మంత్రపుష్పం అమ్మవారికి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకారాలను దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కోరారు. కార్యక్రమంలో ఈఓ కందుల సుధాకర్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితుడు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, ఉప్పులశ్రీనివాస్, నరేశ్‌శర్మ, సాయి వరుణ్, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


