ఈ ఫొటోలో కనిపిస్తోంది నల్లబెల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బొంత విజయ. ఈమె భర్త రవి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన బతికి ఉన్న సమయంలో లారీ కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషించాడు. కొన్నాళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులు రావడంతో లారీని అమ్మాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన రవి రెండు నెలలకే గుండెపోటుతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె నాలుగేళ్ల తర్వాత చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, వెరిఫికేన్ అధికారులు మీ కుటుంబానికి లారీ ఉందని పింఛన్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల అధికారులను కలిసి లారీ తన కుటుంబానికి లేదని గోడు వెల్లబోసుకుంది. ఆర్టీఓ కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రం ఇస్తే పరిశీలిస్తామని అధికారులు తేల్చిచెప్పడంతో ఏంచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఇంటికి తిరిగి వెళ్లింది. ఇలాంటి సమస్య విజయది మాత్రమే కాదు.. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అనేక మంది ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
నల్లబెల్లి: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీతకార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకంలో ధ్రువపత్రాల పరిశీలన పేదలకు తీవ్ర కష్టాలను తెచ్చిపెడుతోంది. అర్హతల నిర్ధారణ కోసం చేపడుతున్న 360 డిగ్రీల వెరిఫికేషన్లో పలు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో సరైన ధ్రువపత్రాలు సమర్పించాలని అధికారులు సూచిస్తుండడంతో దరఖాస్తుదారులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ధ్రువపత్రాలు సమర్పించడం ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు భారంగా మారుతున్న
సాంకేతిక పరిశీలన
ప్రభుత్వం అర్హులకు పింఛన్ అందించేందుకు డిజిటల్ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఆన్లైన్ డిజిటల్ రికార్డుల్లోని వివరాలకు, దరఖాస్తుదారులు సమర్పించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు రావడంతో అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. అధికారులు సరైన పత్రాలు సర్పించాలని సూచిస్తున్నారు. ఏ పత్రం సమర్పించాలి? దాన్ని ఎక్కడ పొందాలి? ఎంత సమయం పడుతుంది? వాటి కోసం అయ్యే ప్రయాణ ఖర్చులు ఎలా భరించాలి? అనే ప్రశ్నలు నిరుపేదలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
పత్రాల కోసం పరుగులు..
మందులు, నిత్యావసర ఖర్చుల కోసం చేయూత పింఛన్ ఆధారపడే నిరుపేదలు ధ్రువపత్రాల కోసం గ్రామాల నుంచి మండల కేంద్రాలకు తిరగాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులు పెరగడంతోపాటు రోజువారీ కూలి పనులను కూడా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి పత్రాల సమర్పణ ప్రక్రియ మరింత భారంగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది.
కారణాలు తెలిపితే మేలు..
దరఖాస్తు తిరస్కరకు గురైతే అందుకు గల నిర్దిష్ట కారణాన్ని అధికారులు స్పష్టంగా తెలియజేయాలని బాధితులు కోరుతున్నారు. కేవలం సరైన పత్రాలు సమర్పించాలి అని చెప్పడం కంటే, ఏ పత్రాలు అవసరమో తెలియజేసి, వివరాల్లోని లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి సాంకేతిక నిబంధనలతో పాటు మానవీయ దృక్పథంతో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించి అర్హులందరికీ చేయూత పింఛన్ అందేలా చూడాలని వేడుకుంటున్నారు.
అర్హులు ఆందోళన చెందొద్దు
చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక ప్రమాణాల ప్రకారమే జరుగుతోంది. డిజిటల్ రికార్డుల్లోని వివరాలతో వ్యత్యాసాలు ఉండడంతో కొన్ని దరఖాస్తుల్లో సాంకేతిక అభ్యంతరాలు వచ్చాయి. అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే వివరాలను సవరించి ఆన్లైన్లో తిరిగి అప్లోడ్ చేస్తాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా పూర్తి సహకారం అందిస్తాం.
– పింగిళి రమణారెడ్డి, ఎంపీడీఓ, నల్లబెల్లి
ధ్రువపత్రాల వెరిఫికేషన్లో గందరగోళం
360 డిగ్రీల పరిశీలనలో దరఖాస్తుల తిరస్కరణ
అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వని అధికారులు


