నర్సంపేట: నర్సంపేట మార్కెట్లో రెండు రోజులుగా రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. మద్దతు ధర రూ.2410 కంటే ఎక్కువగా లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నర్సంపేట మండలం పర్శనాయక్‌తండాకు చెందిన కొర్ర రామన్న తెచ్చిన మక్కలకు రికార్డు స్థాయిలో రూ.2,824 ధర పలికింది. గురువారం కూడా నర్సంపేట మండలం ముత్యాలమ్మతండాకు చెందిన రైతు నునావత్ బలియా తెచ్చిన మక్కలకు రూ.2,807 ధర లభించింది. నర్సంపేట మార్కెట్లో శుక్రవారం కనిష్ట ధర రూ.2,856 కాగా.. మధ్యస్తంగా రూ.2,819 పలికినట్లు అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ బలోపేతంపై సదస్సు
కాశిబుగ్గ: హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ కోఇన్‌చార్జ్ సచిన్ సవత్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా, మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల సదస్సు శుక్రవారం జరిగింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించినట్లు డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు రవీందర్‌రెడ్డి, పోశాల వెంకన్న, ఇస్లావత్ సావిత్రి, ఈగ దామోదర్, జన్ను అరుణాకర్, మాడుగుల రాజ్‌కుమార్, కమాలుద్దీన్, భానుప్రసాద్ పాల్గొన్నారు.
కుష్ఠు లక్షణాలను గుర్తించాలి
గీసుకొండ: కుష్ఠు వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే వ్యాధిని నయం చేయవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజారెడ్డి తెలిపారు. జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం పుఃనశ్చరణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు జిల్లాలో ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (ఎల్సీడీసీ) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ, డీఐఓ డాక్టర్ ఐ.ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇక్తిదార్ అహ్మద్, డాక్టర్ అరుణ్ జోషి, లెప్రసీ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస, డిప్యూటీ పారామెడికల్ అధికారి వెంకన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, నోడల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
జిల్లాలో ఈహెచ్ఎస్ అమలు
కాశిబుగ్గ: జిల్లాలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలు చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇక గుర్తింపు పొందిన ప్రైవేట్ క్లినిక్‌లు, హాస్పిటల్స్, నర్సింగ్ హోంలలో ఈహెచ్ఎస్ వర్తిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. వరంగల్‌లోని సంరక్ష, గంగా, ఎన్ఎస్ఆర్, క్యూర్వెల్, బాలాజీ, సత్య హాస్పిటళ్లలో వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వృద్ధురాలి నుంచి చైన్ అపహరణ
పర్వతగిరి: నగలకు మెరుగుపెడతామని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని మాయమాటలతో మోసగించి సుమారు మూడు తులాల బంగారు చైన్ అపహరించిన సంఘటన శుక్రవారం దౌలత్‌నగర్ శివారు బాజీతండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన వృద్ధురాలు మాలోత్ శాంతి వద్దకు నగలకు మెరుగు పెడతామని వచ్చిన వ్యక్తులు మాట ల్లో పెట్టి బంగారు చైన్‌ను అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడికి సంబంధించిన ఫొటోను విడుదల చేసి ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం తెలిసిన వారు సీఐ (87126 85241), ఎస్సై (8712685242), పర్వతగిరి పోలీస్ స్టేషన్ (8712584037) నంబర్లలో సమాచారం అందించాలని సూచించారు.


