నల్లబెల్లి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం అందించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, క్రైం రిజిస్టర్లు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ ఆవరణ, నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అంకిత్‌కుమార్ శంఖ్వార్ మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే బాధితులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితుల్లో నమ్మకాన్ని నింపేలా మెరుగైన సేవలందించాలన్నారు. ప్రతి కేసులోనూ పారదర్శకమైన దర్యాప్తు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఆయన వెంట నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ శంకర్రావు, ఎస్సై మోడెం సాయిప్రసన్నకుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
నల్లబెల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ


