స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగానికి గ్రేటర్ వాసుల మొగ్గు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–26) గ్రేటర్ వరంగల్ రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా సాగుతోంది. నగరంలో ఉంటున్న వేలాది మంది ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించేందుకు మొగ్గు చూపుతుండడంతో ట్రైసిటీలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ మందగించింది. ఇదే పరిస్థితి కొనసాగితే నగర ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉండడంతో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 నుంచి 88 డివిజన్లకు పెంచాలన్న ప్రతిపాదనపై ప్రభావం పడుతుందా? అనే చర్చ మొదలైంది.
నగరంపై నిరాసక్తత
ఉద్యోగాలు, వ్యాపారాల కోసం గ్రేటర్ వరంగల్‌లో నివాసం ఉంటున్న వేలాది మంది ఓటర్లు తమ శాశ్వత నివాసం గ్రామాలేనని, అక్కడే ఓటు హక్కు కొనసాగించాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ నియోజకవర్గాలు, మండలాల్లోనే తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అందువల్ల గ్రేటర్ వరంగల్ నగరంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లినా చాలామంది ఫారాలు తీసుకున్నా తిరిగి ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఫలితంగా హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 5,09,014 ఫారాలు పంపిణీ చేయగా.. 3,86,676 (75.97 శాతం) డిజిటైజేషన్ అయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వరంగల్ నగరంలో 1,82,991 (63.91 శాతం)లు ఎన్యుమరేషన్ పత్రాలు (ఈఎఫ్) నింపి ఇచ్చారు. వరంగల్ జిల్లాలో మూడు నియోజకవర్గాలు చూస్తే 7,76,953 లకు 6,52,211 (83.94 శాతం) డిజిటైజ్ కాగా, వరంగల్ తూర్పులో డిజిటైజేషన్1,67,115 (64.17 శాతం)లే కావడం గమనార్హం. వరంగల్ తూర్పు. పశ్చిమలో 35 శాతం వరకు తక్కువ నమోదు కాగా.. రెండు జిల్లాల్లోని మిగతా నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలకు చెందిన మండలాల్లో 78 శాతం నుంచి 99.81 శాతం వరకు డిజిటైజ్ అయ్యాయి.
డివిజన్‌ల పెంపుపై ప్రభావం
గ్రేటర్ వరంగల్‌లో ఉన్న 66 డివిజన్లను 88కు పెంచాలన్న ప్రతిపాదన 2025 ఆగస్టులో మొదలైంది. పాలకవర్గం పదవీకాలం 2026 మే 7తో ముగియకముందే డివిజన్ల పునర్విభజన పూర్తి చేయాలనే పట్టుదలలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా డివిజన్ల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వంతో 2025 డిసెంబర్‌లో చర్చించినట్లు కూడా ప్రకటించారు. 66 డివిజన్లను 88కి మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 2011 జనాభా లెక్కలు, కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా 12–13 వేల జనాభా నుంచి 7–9 వేల ఓటర్ల లెక్కల ఆధారంగా కొత్త అంచనాలు వేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక డూప్లికేట్ నమోదుల తొలగింపు, వరంగల్ నగరంలో ఫారాలు సమర్పించని ఓటర్ల వివరాల పరిశీలన పూర్తయితే తుది సంఖ్యలో మార్పులు కనిపించే అవకాశముందని ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వర్గాలు భావిస్తున్నాయి. ఎస్‌ఐఆర్ తుది జాబితా తర్వాత గ్రేటర్ వరంగల్‌లో ఓటర్ల సంఖ్యలో వచ్చే మార్పులే డివిజన్ల పునర్విభజన దిశను నిర్ణయించే అవకాశముందన్న చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.
వరంగల్ పశ్చిమ
జిల్లాలో మొత్తం ఓటర్లు
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
డిజిటైజ్ చేసిన ఫారాలు డిజిటైజేషన్
వరంగల్ తూర్పు
సర్ పురోగతి ఇదీ..
ఆగస్టు 3 ప్రత్యేక ఓటర్ల సవరణకు గడువు. మరో తొమ్మిది రోజుల గడువే ఉండగా, శుక్రవారం నాటికి గ్రేటర్ వరంగల్‌లో (రెండు నియోజకవర్గాల) సగటు 64.04 శాతం ఎన్యుమరేషన్ ఫారాలే బీఎల్‌ఓలకు అందాయి. ఇల్లిల్లూ తిరిగినా రెండు చోట్ల నమోదుకు అవకాశం లేకపోవడంతో తిరిగి ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున డూప్లికేట్ నమోదుల తొలగింపు, స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించాలనే ధోరణి కొనసాగితే తగ్గే అవకాశం ఉందని ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వర్గాలు భావిస్తున్నాయి. స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించాలనే ధోరణితో పాటు డూప్లికేట్ నమోదుల తొలగింపు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఎస్‌ఐఆర్ తుది జాబితా తర్వాత స్పష్టత రానుంది.
వృత్తి, ఉద్యోగరీత్యా నగరంలో జీవనం
ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇచ్చేందుకు విముఖత
‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో తగ్గుతున్న నమోదు


