ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..! | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..!

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..!

నత్తనడకన ఐలాండ్‌ పనులు

రామప్పకు యునెస్కో గుర్తింపు (వారసత్వ హోదా) వచ్చినా మారని రూపురేఖలు

ములుగు: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చి నేటి (శనివారం)కి ఐదేళ్లు పూర్తయినా ఏ మార్పూ కనిపించ డం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో 1213లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి వారసత్వ సంపదగా యునెస్కో హోదా కల్పిస్తున్నట్లు 2021, జూలై 25న వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్‌ ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు సంబురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ఆలయాన్ని సందర్శించి ఆలయ రూపురేఖలు మార్చేస్తామని, ప్రభుత్వాలనుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

వినియోగంలోకి రాని ఉప ఆలయాలు

రామప్ప ఆలయం ముందు ఉన్న గొల్లాల గుడికి మరమ్మతులు చేపట్టినప్పటికీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరో శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా కూలిపోతోందని దానికి సపోర్టుగా ఇనుపపైపులను అమర్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇటీవల ఆ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా కేంద్రం గుర్తించింది. మరికొన్ని ఉప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

ప్రారంభమెప్పుడో..

దేవాలయానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ ప్రాజెక్టు కింద రూ.61.99 కోట్ల నిధులను కేటాయించింది. మొదటి విడతగా రూ.42.14 కోట్ల నిధులు మంజూరు చేసి సుమారు 10 ఎకరాల్లో ఇంటర్‌ ప్రిటేషన్‌ సెంటర్‌ను నిర్మించారు. కానీ, కాంట్రాక్టర్‌కు బిల్లు రాలేదనే నెపంతో సెంటర్‌ను ప్రారంభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. 2022 డిసెంబర్‌లోగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్‌ కమిటీ షరతు విధించినప్పటికీ ఇప్పటివరకు పునాదులకే పరిమితమైంది.

రామప్ప సరస్సులోని ఐలాండ్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సాస్కి పథకం కింద మంజూరైన రూ.13 కోట్లతో ఐలాండ్‌లో భారీ శివుడి విగ్రహం, రెస్టారెంట్‌, కెఫిటేరియా, చిల్డ్రన్స్‌పార్కు, బటర్‌ ఫ్లై గార్డెన్‌ నిర్మిస్తుండగా పనులు వేగవంతంగా కొనసాగడం లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది నవంబర్‌లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు పనుల పురోగతిలో ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు.

పునాదుల్లోనే కామేశ్వరాలయం.. ముందుకు సాగని ఐలాండ్‌ పనులు

నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌

పనులు పూర్తయితే మరింత సుందరంగా ఆలయ పరిసరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement