ఖానాపురం: మంగళవారిపేటలోని ఆబోతు కుమార్ వ్యవసాయ బావిలో ఉన్న మొసలిని
అధికారులు శుక్రవారం బంధించారు. ఎంపీడీఓ అద్వైత, ఎఫ్‌ఆర్వో నరేశ్ బసవ, సర్పంచ్ గొంది సుజాతనాగేశ్వర్‌రావు, డీఆర్వో సుధాకర్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బావిలో నీటిని తొలగించారు. అటవీశాఖ సిబ్బంది రవి, శివ ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి బావిలో ఉన్న మొసలిని బంధించారు. తాళ్ల సాయంతో మొసలిని బయటకు తీసి వాహనంలో పాకాలకు తీసుకెళ్లి చెరువులో వదిలారు.
వరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు వర్గాలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశాయి. ఈమేరకు వరంగల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కె.పూజ, హనుమకొండ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సెహాగ్, మొదటి జూనియర్ సివిల్ జడ్జి టీఎం వైష్ణవికి సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి కల్పించారు.
కాజీపేట అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ నియామక పరీక్షలకు ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25 నుంచి ఆగష్టు 14వ తేదీ వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 0870–2571192 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
హన్మకొండ కల్చరల్: దేవాదాయశాఖ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు వేయిస్తంభాల ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వరుణ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. వరుణ పూజల్లో భాగంగా మొదటి ఆలయ నాట్య మండపంలో వేద పండితులు మణికంఠశర్మ, పానుగంటి సాయి తేజ, శ్రీవాస్తవ, అర్చకులు ప్రణవ్, కాశిలింగాచారి సకాలంలో వర్షాలు పడాలని వరుణ జపం, రుశ్యశృంగ పారాయణం నిర్వహించారు. నేడు శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఉదయం 7 గంటలకు శత ఘటాభిషేకం ప్రారంభమవుతుందని, అలాగే, రేపు 26న ఆదివారం వరుణ హోమం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు.
బీరన్న బోనాలకు
సర్వం సిద్ధం
ఖిలా వరంగల్: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం వరంగల్ ఉర్సు కరీమాబాద్‌లోని బీరన్న దేవాలయం బోనాలకు సర్వం సిద్ధమైంది. బీరన్న స్వామి దేవాలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో బీరన్న ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆలయ పరిసరాల్లో బల్దియా అధికారులు తాగునీటి ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఆలయంలో కురుమ కులస్తులే కాకుండా స్థానికంగా ఉండే ఇతర కులస్తులు కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కడతారు. ఆలయ పూజారులు స్వామి వారి బండారి, కంకణాలు సిద్ధం చేశారు. మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కురుమల ఉపవాస దీక్షతోనే బీరన్నకు నైవేద్యంగా బోనాన్ని సమర్పించనున్నట్లు బీరన్న ఆలయ కమిటీ చైర్మన్ మరుపల్లి రవి తెలిపారు.


