కిలోమీటరు ఫోర్‌లేన్ ఆర్‌ఓబీ పనులకు రూ.67.70 కోట్లు మంజూరు
● రైల్వే నిధులను వాడుకున్న రాష్ట్ర సర్కారు
● ఫలితంగా ఆలస్యమవుతున్న పనులు
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ – సంగెం మండలాల పరిధిలోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)కు సరుకు రవాణా వాహనాల రాకపోకల కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులకు గ్రహణం పట్టింది. ఆర్‌ఓబీ నిర్మాణానికి రైల్వేశాఖ నిధులను మంజూరు చేసి రాష్ట్రానికి బదలాయించగా, వాటిని రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్‌ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2017, అక్టోబర్ 22న కేఎంటీపీ పనులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అప్పుడే కేఎంటీపీకి రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి ఆర్‌ఓబీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత రైల్వే శాఖ ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.67.70 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించింది. దాంతో నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. పనులు చేపట్టే బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించగా 2023, జూలై 31న పనులకు ఒప్పందం ఖరారైంది. ఆ తర్వాత సదరు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించగా, సంబంధిత అధికారులు రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. సుమారు రూ.33 కోట్ల మేర పనులు చేయగా రాష్ట్ర సర్కారు నుంచి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ వాపోతున్నాడు. ఆర్‌ఓబీకి కేటాయించిన నిధులను వేరే అవసరాలకు ప్రభుత్వం మళ్లించడంతో పనులకు గ్రహణం పట్టినట్‌లైంది, నిధులను సకాలంలో విడుదల చేస్తే నాలుగు నెలల్లో పనులను పూర్తి చేస్తామని సదరు కాంట్రాక్టర్ చెబుతున్నాడు.
పనులను పరిశీలించిన కలెక్టర్
ఇటీవల ఆర్‌ఓబీ నిర్మాణ పనులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. బిల్లులు మంజూరు కావడం లేదని, నిర్మాణ పనుల కోసం మట్టి (మొరం) లభించడం లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆమె వెంటనే స్పందించి శాయంపేట హవేలిలోని ఊర చెరువు నుంచి మట్టిని తీసుకెళ్లాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొందరు మట్టి తరలింపు పనులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కాంట్రాక్టర్ చెబుతున్నాడు.
ఆర్‌ఓబీతో ఎంతో ప్రయోజనం
ఆర్‌ఓబీని ఫోర్ లేన్‌గా రైల్వే ట్రాక్‌లపై నుంచి కిలోమీటరు పొడవులో ఇరువైపులా నిర్మిస్తున్నారు. రెండు లేన్లు కలిపి ఒక రోడ్డు.. ఇలా నాలుగు లేన్లకు రెండు రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. రెండు లేన్ల రోడ్డు 30 అడుగుల వెడల్పుతో ఉండి భారీ వాహనాలు అటు, ఇటు వెళ్లేంత వీలుగా ఉంటుంది. నిర్మాణం పూర్తైతే కేఎంటీపీకి ముడిసరుకుల చేరవేత, తయారైన దుస్తుల కంటెయినర్లు, ఇతర వస్తువుల రవాణా సులభతరం కానుంది. అలాగే, గీసుకొండ – సంగెం మండలాల ప్రజలకు ఇది వారధిగా మారనుంది. రైల్వే గేట్లతో ఇబ్బందులు తొలగి బ్రిడ్జిపై నుంచి సులభంగా రాకపోకలను సాగించవచ్చు. కాజీపేట – విజయవాడ రైలు మార్గంలో శాయంపేట రైల్వే గేట్ (ఎల్‌సీ 66), దానికి కొంతదూరంలో చింతలపల్లి రైల్వే గేట్ (ఎల్‌సీ 67)ల మధ్య ఆర్‌ఓబీని నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తైతే గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి వెళ్లే వాహనాలకు ఆర్‌ఓబీ లింక్‌గా మారనుంది. వరంగల్ – నర్సంపేట రహదారికి ట్రాఫిక్ దృష్ట్యా ప్రాధాన్యం పెరగనుంది. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని గీసుకొండ, సంగెం మండలాల ప్రజలు కోరుతున్నారు. పనుల విషయమై ఆర్‌అండ్‌బీ డీఈ దేవికను వివరణ కోరగా.. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, మరో రెండు నెలల్లో మిగతా పనులు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు.


