నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని వివరించే మాక్‌ ఎక్సర్‌సైజ్‌ (డ్రిల్‌)ను ఖిలా వరంగల్‌ గుండు చెరువు వద్ద నిర్వహిస్తున్నందున గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌ కూడా..

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) జరిగే గ్రీవెన్స్‌ సెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రత్యేకాధికారి, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్‌ ఎక్సర్‌సైజ్‌ (మాక్‌ డ్రిల్‌) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ జరుగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ఉచిత శిక్షణ కోసం పరీక్ష

న్యూశాయంపేట: నిరుపేద మైనారిటీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్‌ హైస్కూల్‌, వరంగల్‌ జిల్లా వారికి సుఫా హైస్కూల్‌లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. సుమారు 160 మంది దరఖాస్తులు సమర్పించినట్లు శిక్షణ కేంద్రం ఇన్‌చార్జ్‌ ఫ్యాకల్టీలు తెలిపారు. కాగా, 140 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు ఫర్హానా తబస్సుమ్‌, ఆసిఫ్‌అఫ్జల్‌ తెలిపారు.

ప్రమాదవశాత్తు ఆయిల్‌పామ్‌ తోట దగ్ధం

పర్వతగిరి: మండలంలోని అన్నారం శివారులో నూనావత్‌ బిక్కుకు చెందిన నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్‌ తోట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన రైతు బిక్కుకు పర్వతగిరి మండలం అన్నారం శివారులో ఆయిల్‌పామ్‌ తోట ఉంది. ఆదివారం మధ్యాహ్నం అన్నారం గ్రామానికి చెందిన రైతు గొడుగు సారయ్యకు చెందిన మొక్కజొన్న చేనులో ఏర్పడిన మంటలు వేగంగా సుమారు రెండు కిలో మీటర్ల మేర వ్యాపించాయి. దాంతో ఆయిల్‌పామ్‌ తోటలోని 215 చెట్లు, డ్రిప్‌ పైపులు, స్టార్టర్‌ మోటార్లతో సహా బిందు సేద్యం పరికరాలు కాలిపోయాయి. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.

ఫోరెన్సిక్‌ సైబర్‌ సెక్యూరిటీలో ప్రజ్వలకు మాస్టర్స్‌ పట్టా

నర్సంపేట: అమెరికా న్యూజెర్సీలోని ప్రఖ్యాత సెయింట్‌ పీటర్స్‌ యూనివర్సిటీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో నర్సంపేట పట్టణానికి చెందిన పెద్దారపు ప్రజ్వల పాల్గొని ప్రతిభ కనబర్చి మాస్టర్స్‌ పట్టా సాధించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ చేతుల మీదుగా పట్టా అందుకుంది. దీంతో ప్రజ్వల తల్లిదండ్రులు పెద్దారపు రమేష్‌ – రాధ, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజ్వల ఏడో తరగతి వరకు నర్సంపేటలో, ఇంటర్‌ వరకు వరంగల్‌లో, ఫోరెన్సిక్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తరప్రదేశ్‌ మధుర లో అభ్యసించారు. అనంతరం, ఫోరెన్సిక్‌లో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికాలోని న్యూజెర్సీలోని సెయింట్‌ పీటర్స్‌ యూనివర్సిటీ అడ్మిషన్‌ ఇవ్వగా, ప్రజ్వల ప్రతిభ కనబర్చి మాస్టర్స్‌ పట్టా సాధించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement