వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) జరిగే గ్రీవెన్స్ సెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రత్యేకాధికారి, ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్ ఎక్సర్‌సైజ్ (మాక్ డ్రిల్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని వివరించే మాక్ ఎక్సర్‌సైజ్ (డ్రిల్)ను నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నందున గ్రీవెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
ఉచిత శిక్షణ కోసం పరీక్ష
న్యూశాయంపేట: నిరుపేద మైనార్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్ హైస్కూల్, వరంగల్ జిల్లా వారికి సుఫా హైస్కూల్‌లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. సుమారు 160 మంది దరఖాస్తులు సమర్పించినట్లు శిక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ ఫ్యాకల్టీలు తెలిపారు. కాగా, 140 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు ఫర్హానా తబస్సుమ్, ఆసిఫ్‌అఫ్జల్ తెలిపారు.
ఖిలా వరంగల్: ఓరుగల్లు వీరత్వానికి పురిటిగడ్డ అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, సినీగేయ రచయిత కాసర్ల శ్యాం, ఓయూ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ ప్రాంగణంలో చేతనే కళావేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల నాగేశ్వర్ ఆధ్వర్యంలో కాకతీయ కళాజాతర ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ నేల చారిత్రక వైభవంతోపాటు కళలు, సాహిత్యం, జానపద సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిందని చెప్పారు. కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గేయ రచయిత శ్రీనివాస్, గందె నవీన్, ఎడ్ల అశోక్‌రెడ్డి, పుల్లారావు, గోకారపు శ్యాం, సంగీత దర్శకుడు కార్తీక్, గాయకుడు కొల్లూరి యోగానంద్, కళాకారులు పాల్గొన్నారు.


