ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై అవగాహన లేక లబ్ధిదారులకు ఇక్కట్లు
ఇందిరమ్మ
ఇళ్లకు
సాక్షి, వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక తిప్పలు తప్పడం లేదు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి న ‘మన ఇసుక వాహనం’ యాప్‌లో వివరాలు పొందుపరిచి ఇసుక బుకింగ్ చేసుకునే విధానం తెలియక చాలామంది నేరుగా తమ ఊరి ట్రాక్టర్ల ద్వారా ఒక్కో ట్రిప్పునకు రూ.నాలుగు వేల వరకు చెల్లిస్తూ ఇంటి నిర్మాణం ముందుకు సాగేలా చూసుకుంటున్నారు.
నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని..
వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో ఈ పరిస్థితి ఉండగా, నర్సంపేట నియోజవర్గంలోని నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపూర్ మండలాల్లో మాత్రం టన్నుకు రూ.వెయ్యి ఆన్‌లైన్‌లో చెల్లించి కొంతమంది లబ్ధిదారులు కలిసి ఒకేసారి లారీలో ఇసుక తెప్పించుకుంటున్నారు. ఇంకొంతమంది నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని టన్నుకు రూ.1,650 చెల్లించి ఒకేసారి పెద్ద మొత్తంలో తెప్పించుకొని డంపు చేసుకుంటున్నారు. మన ఇసుక వాహనం యాప్‌లో బుక్ చేసుకోవడం ద్వారా ఉచితంగానే ఇసుక వస్తున్నా, ఆయా ట్రాక్టర్, లారీలకు రవాణా చార్జీలు కూడా తక్కువ మొత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా లబ్ధిదారులకు సరైన అవగాహన లేక ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.
కూపన్ల సిస్టమ్ రద్దు
లబ్ధిదారులు అత్యవసరం పేరుతో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకు వెచ్చిస్తూ పనులు సాగేలా చూసుకుంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సమీప ఇసుక క్వారీ నుంచి తక్కువ ధరకు ఇసుక తెచ్చుకునేందుకు ఒక్కో ఇంటికి కూపన్లు సరఫరా చేసేవారు. నిర్మాణ దశలను బట్టి కూపన్లు ఇచ్చేవారు. అయితే, ఆ విధానాన్ని రద్దు చేసి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని కూపన్లు పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, చాలామంది లబ్ధిదారులకు ఈ రెండింటి విషయంలో అవగాహన లేక సతమతమవుతున్నారు. గత నెల ఒకటి నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని కూపన్లు పొందాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులు ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక బుక్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆమోద పత్రం తప్పనిసరి కావడంతో నిరీక్షించే సమయం లేక ప్రైవేట్‌లో ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం ఆగకుండా చూసుకుంటున్నారు. ఫలితంగా లబ్ధిదారులకు ఉచిత ఇసుక పంపిణీ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలొస్తున్నాయి.
పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ అవసరం
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పడు ఆయా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తూ ఇసుక అవసరం ఉందనుకున్న సమయంలో ముందుగానే గుర్తించి లబ్ధిదారులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేలా ప్రోత్సహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొందరు కార్యదర్శులైతే లబ్ధిదారులను మీ సేవతో పాటు ఇతర ప్రైవేట్ నెట్ కేంద్రాలకు పంపించి అక్కడా అప్లై చేసుకొని కొంత చార్జీలు చెల్లించేలా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్లు ఇసుక పరిమాణం అవసరమవుతోంది. పునాది, పిల్లర్లు, స్లాబ్, గోడల నిర్మాణ దశల్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొన్నటివరకు అమలైన కూపన్లు వ్యవస్థతో ఇబ్బందిపడని లబ్ధిదారులు.. ఆన్‌లైన్ సాండ్ బుకింగ్‌తో ఆగమాగం అవుతున్నారు. పూర్తిస్థాయిలో వివరాలు తెలియక ప్రైవేట్‌లో ఇసుక కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ‘ఆన్‌లైన్ యాప్‌లో ఇసుక బుక్ చేసుకుంటే ఉచితం. దాన్ని తీసుకెళ్లే ట్రాక్టర్ రవాణా చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయంలో కార్యదర్శుల సహాయం తీసుకోవాలి’ అని జిల్లా గృహ నిర్మాణ విభాగం బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తెలిపారు.
లబ్ధిదారులకు సహకారం అందిస్తున్నాం
గొడిశాల వికాస్, కాల్‌నాయక్ తండా పంచాయతీ కార్యదర్శి చెన్నారావుపేట మండల పరిధిలోని కాల్‌నాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొమ్మిది మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు మేమే ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇసుకకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– గొడిశాల వికాస్, పంచాయతీ కార్యదర్శి,
కాల్‌నాయక్ తండా
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
రూఫ్ లెవల్:
824
పూర్తి అయినవి:
775
మంజూరైన ఇళ్లు:
12,053
ముగ్గు పోసినవి:
6,754
బేస్‌మెంట్ దశలో: 1,095
ప్రైవేట్‌గా ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకకు రూ.వేలల్లో ఖర్చు
ఫలితంగా అదనంగా ఆర్థిక భారంతో సతమతం
పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకుంటేనే సులభతరం


