సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగరాజుపల్లి, ముచ్చింపుల, రంగాపురం గ్రామాల్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.48 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి దళితవాడలతో పాటు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోరిక మేరకు ముచ్చింపుల, దస్థగిరిపల్లి, రంగాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని, కాటమయ్య దేవాలయ నిర్మాణంతో పాటు మహిళ బిల్డింగ్ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు పాలాయి శ్రీనివాస్, తోకల శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ రమేష్, వైనాల అశోక్, ఇస్తారి శేఖర్, మునేందర్, సురేష్, సర్పంచ్‌లు ఎరుకల లలిత రఘు, సిద్ద సంతోష్, సంగ పోశాలు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి


