మోడల్ రాకెట్ విఫలం
ప్రయోగం తుస్.. వీక్షకుల నిరాశ
నయీంనగర్: సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి చెరువులోని ఐలాండ్‌పై ఏర్పాటుచేసిన రుద్రమ–1 మోడల్ రాకెట్ లాంచ్ తుస్‌మంది. పట్టుమని వంద అడుగులు కూడా ఎగరలేదు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ‘కుడా’ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి తొలుత చిన్న రాకెట్‌ను లాంచ్ చేయగా.. కొన్ని అడుగుల ఎత్తులోకి వెళ్లి కొంత దూరంలో నేల కూలింది. కొంత సమయం తర్వాత మరో రాకెట్‌ను ప్రయోగించగా అది కూడా తుస్‌మంటూ చెరువులో పడింది. మోడల్ రాకెట్ విఫలం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన స్కూల్ విద్యార్థులు, యువత, సైన్స్, ఖగోళప్రియులు, నగర ప్రజలు నిరాశ చెందారు. మోడల్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, వరంగల్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ‘కుడా’, పోలీస్, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
మోడల్ రాకెట్ విఫలం


