మెరుగైన వైద్యసేవలందించాలి
వర్ధన్నపేట: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వైద్యులు తమ విధులపై నిర్లక్ష్యం వహించడం సరికాదని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రిని వైస్ చైర్‌పర్సన్ షిభారాణి, వార్డు కౌన్సిలర్లు పాపారావు, కమిలితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌లో వైద్యులు హాజరైనట్లు ఉండగా ఆరుగురు వైద్యులు గైర్హాజరైనట్లు గుర్తించి సూపరింటెండెంట్ స్వామిని అడిగారు. దీంతో ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఓ బాలుడిని వైద్యచికిత్సకు తీసుకువస్తే వైద్యం అందించకుండా ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆస్పత్రిని సందర్శించామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కాగా ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని సూపరింటెండెంట్ తెలపగా ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పాకాల సందర్శన
ఖానాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని సర్కిల్‌కు చెందిన ఫారెస్ట్ అధికారులు మంగళవారం పాకాల ఎకోటూరిజాన్ని సందర్శించారు. స్టడీటూర్‌లో భాగంగా పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎకోటూరిజంపై జరుగుతున్న అభివృద్ధిని ఎఫ్‌ఆర్వో పుప్పాల రవికిరణ్ వివరించారు. ఎఫ్‌ఆర్వోలు, డీఆర్వోలు, సెక్షన్ ఆఫీసర్‌లు, బీట్ అధికారులు సుమారు 40 మంది పాకాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
త్వరితగతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
హన్మకొండ: త్వరితగతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా గరిష్టస్థాయిలో వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌లు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 355 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇతర అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, అధికారుల సమన్వయం, సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవంతమైందని ఎస్‌ఈ తెలిపారు.
27న అవగాహన సదస్సు
కాళోజీ సెంటర్: టామ్‌కామ్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈనెల 27న ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను tomcom.resume@gmail.comకు ఈమెయిల్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 944 004 9520, 944 0052 2081 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
మెరుగైన వైద్యసేవలందించాలి
మెరుగైన వైద్యసేవలందించాలి


