పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
● వీసీలో సీఎస్ రామకృష్ణారావు
కాళోజీ సెంటర్: టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్, డీఈఓ బి.రంగయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల కోసం విద్య, వైద్య, పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపధ్యంలో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మాస్ కాపీయింగ్, చీటింగ్, మాల్ ప్రాక్టీస్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు కూర్చోవడానికి డ్యుయల్ డెస్క్ టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి బీఎన్‌ఎస్ సెక్షన్ 163, సీఆర్‌పీ సెక్షన్ 144 అమలు చేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మాత్రమే సీసీటీవీ నిఘాలో తెరవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్, టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ డీఎం అర్పిత, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఇంటర్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
న్యూశాయంపేట: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్, ఆరోగ్య, రెవె న్యూ, ఆర్‌టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ తదితర శాఖలు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పౌరసంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.


