అవినీతి.. వ్యవస్థీకృతం
హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలో ఈ భవనాన్ని 2002 సంవత్సరంలో నిర్మించారు. జీప్లస్ 1కు అనుమతి తీసుకున్నారు. అదనంగా మరో అంతస్తు నిర్మించారు. ఇప్పటి వరకు రివైజ్డ్ చేయలేదు.. ఇలా నగరంలో వేలాది భవనాలు రివైజ్డ్ చేయకపోవడంతో వరంగల్ మహానగర పాలకసంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
వరంగల్ అర్బన్: కంచె చేను మేసిన చందంగా వరంగల్ మహానగర పాలకసంస్థ పన్నుల విభాగం సిబ్బంది ఖజానాకు చేరాల్సిన సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. నిబంధనలు విస్మరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అనుమతులు ఉంటే ఒక రేటు.. లేకుంటే మరో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. టౌన్‌ప్లానింగ్, పన్నుల విభాగం, ఇంజనీరింగ్ సెక్షన్ ఇలా అన్నింట్లో అవినీతి వ్యవస్థీకృతమైంది. బల్దియాలోని అన్ని విభాగాల్లో కాకిలెక్కలే ఆధారమవుతున్నాయి. విధానపరమైన వాస్తవాలు దూరంగా ఉన్నాయి. నగరంలోని ఇళ్లు, వాణిజ్య భవనాల అసెస్‌మెంట్లు 2 లక్షల పైచిలుకు ఉన్నాయి. కానీ, 60 శాతం ఇళ్లకు మాత్రమే అనుమతులున్నాయి. అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే కోట్ల రూపాయల అదాయం వస్తుంది.
పర్సంటేజీలతో పన్నుల విభాగం..
కనిపించిన నిర్మాణం నుంచే ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంటి అనుమతి ఉన్నా, లేకున్నా పన్ను మదింపు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. అనుమతి ఉంటే సరాసరి పన్ను విధిస్తున్నారు. లేకుంటే 100 శాతం అదనపు పన్ను బాదుతున్నారు. కొత్తగా ఇంటినంబర్ కావాలంటే అనుమతి ఉంటే రూ.2 వేలు, లేకపోతే రూ.వేలల్లో ముట్టజెప్పాల్సిందేనని ప్రజలు పేర్కొంటున్నారు. లేదంటే అనుమతులు, వాణిజ్యపరమైన అంశాలను ప్రస్తావిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికై నా వరంగల్ మహానగర పాలకసంస్థ ఉన్నతాధికారులు, పాలకవర్గం స్పందించి అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అవినీతి.. వ్యవస్థీకృతం


