బంజారాలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: బంజారాలకు రిజర్వేషన్ కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ సత్యశారద ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ బంజారా బిడ్డలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి జీవితాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వెలుగులు నింపారని కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లుగాక ఎస్టీలకు ప్రత్యేకంగా మరో 250 ఇళ్లు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నారాయణ రెడ్డి, సేవాలాల్ ఉత్సవ సమితి చైర్మన్ గోపాల్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.


