బాలల హక్కులను పరిరక్షించాలి
● పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి
● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు
గీసుకొండ: పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, సరిత సూచించారు. మండలంలోని గొర్రెకుంట జెడ్పీ ఉన్నత, అంగన్‌వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల, పోతరాజుపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలను వారు శుక్రవారం సందర్శించారు. అనంతరం ధర్మారం జెడ్పీ పాఠశాల కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, బడికి రాని పిల్లలను బడిలో చేర్పించాలని, బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. కాగా, తమకు నెలల తరబడి బిల్లులు రావడం లేదని కమిషన్ సభ్యుల ఎదుట వంట ఏజెన్సీ నిర్వాహకులు వాపోయారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ వసుధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, బాలల సంక్షేమ సమితి సభ్యులు షాహిదాబేగం, సంపత్, సుజాత, మధు, సీడీపీఓ విద్య, డీసీపీఓ ఉప, ఎంఈఓ రవీందర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్మారావుపేటలో మధ్యాహ్న భోజనం తనిఖీ
ఖానాపురం: మండలంలోని ధర్మరావుపేట గ్రామంలోని హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్న భోజన రాష్ట్రస్థాయి బృందం సభ్యులు శ్రుతి, ఏసుబాబు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ, భోజన అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంటోంది.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. కాగా, తమకు వేతనాలు పెంచాలని మధ్యాహ్న వంట కార్మికులు తనిఖీ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చరణ్‌సింగ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులను పరిరక్షించాలి


