కొమ్మాల ఆలయాభివృద్ధికి కృషి
● రూ.2 కోట్లతో గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు
● శాశ్వత కమిటీ ఏర్పాటుపై దృష్టి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈనెల 23 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొమ్మాల ఆలయం వద్ద అధికారులతో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.కోటి నిధులతో ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు. గుట్ట చుట్టూ బండ్లు తిరగడానికి రింగ్ రోడ్డు కోసం రూ.2 కోట్లు, నాచినపల్లి రోడ్డు నిర్మాణం, విస్తరణ కోసం రూ.కోటి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. కాగా, ఆలయ ఈఓ ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమున తీసుకొచ్చారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొమురయ్య, తహసీల్దారు రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, సీఐ విశ్వేశ్వర్, ఈఓ ప్రసాద్, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచార్యులు, ఫణి, విష్ణు, నందనాయక్ తండా సర్పంచ్ వీరేందర్, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చాడ కొమురారెడ్డి, మండల అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, నాయకులు వీరాటి రవీందర్‌రెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.


