ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలి
దుగ్గొండి: పాఠశాలలోని ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించేలా వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రతీ చెట్టుకు పేరుపెట్టి క్యూఆర్ కోడ్ లేబుల్ వేయాలని చెప్పారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించారు. తరగతి గదులు, నూతన వంటశాల, భోజనశాల, ల్యాబ్, గ్రంథాలయం, క్రీడా పరికరాలు, మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన వంటశాలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రస్తుత వంటశాలను అంగన్‌వాడీ సెంటర్‌కు అప్పగించాలని సూచించారు. పాఠశాల నిర్వహణలో వెలుగులోకి వచ్చిన లోపాలను వెంటనే సరిచేసి వారం రోజుల వ్యవధిలో ఫొటోలతో కూడిన నివేదికను అందించాలని హెచ్‌ఎం ఎలగొండ రామస్వామిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


