
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన
● మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
● రేపు సాగు నీటి సమస్య పరిష్కారానికి పాదయాత్ర
వేలేరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. శుక్రవారం వేలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో 2023 ఫిబ్రవరిలో రూ.104 కోట్లతో పనులు ప్రారంభించి మొదటి, రెండో దశ పనులు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోనే పూర్తి చేశామన్నారు. మూడో దశ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందక క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం యూరియా కొరత లేదని అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నాడని విమర్శించారు. మూడో దశ సాగునీటి పనులు ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 31న వేలేరు అంబేడ్కర్ సెంటర్ నుంచి గండిరామారం రిజర్వాయర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ భూపతిరాజు, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మండల కో–ఆర్డినేటర్ గోవింద సురేశ్, ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్ మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, గ్రామ కన్వీనర్ సూత్రపు సంపత్, నాయకులు విజేందర్‌రెడ్డి, జానీ, మహేందర్, శ్యామ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.