పర్వతగిరి: యూరియా కోసం క్యూలో ఉన్న రైతుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతగిరి పీఏసీఎస్ పరిధిలోని కల్లెడ గ్రామానికి మంగళవారం 444 బస్తాల యూరియా రాగా.. రెండు వేల మంది రైతులు బారులుదీరారు. వంద మంది రైతులకు అధికారులు కూపన్లు పంపిణీ చేసి మిగిలిన వారిని క్యూలో ఉండమని సూచించారు. ఎక్కువ మంది రావడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. గమనించిన పీఏసీఎస్ సీఈఓ సురేశ్, వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంత్‌కుమార్, ఎస్సై బోగం ప్రవీణ్ తక్షణమే కూపన్లు, యూరియా పంపిణీ నిలిపివేశారు. దీంతో రైతులు నిరాశకు గురై వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూపన్లు ఇచ్చి యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఈఓ సురేశ్‌ను వివరణ కోరగా గత ఏడాది ఈ సమయం వరకు 15 లారీల యూరియా రాగా.. ఈ ఏడాది 8 లారీల యూరియా మాత్రమే వచ్చిందని తెలిపారు. వారానికి ఒక లారీ రావాల్సి ఉండగా.. 25 రోజులకు ఒక లారీ రావడంతో రైతులు యూరియా కోసం బారులుదీరుతున్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి టోకెన్లు ఇచ్చి యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేస్తామని ఏఓ ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
గ్రోమోర్ షాపు ఎదుట పడిగాపులు..
వర్ధన్నపేట: యూరియా కోసం మండల కేంద్రంలోని గ్రోమోర్ షాపు ఎదుట రైతులు మంగళవారం క్యూలైన్‌లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. వారం రోజులుగా యూరియా దొరకడం లేదని, పంట సాగుకు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందపల్లి పీఏసీఎస్ కార్యాలయం వద్ద..
దుగ్గొండి: యూరియా కోసం మందపల్లి పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు భారీగా తరలివచ్చారు. ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. మండల వ్యవసాయ అధికారి మాధవి మాట్లాడుతూ అపోహతోనే రైతులు యూరియా నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడుతోందని తెలిపారు. మండలానికి ఇప్పటివరకు 1336 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇంకా 30 టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.
క్యూలైన్‌లో తోపులాట..
పంపిణీ నిలిపివేసిన అధికారులు
కల్లెడ గ్రామంలో నిరాశతో
వెనుదిరిగిన రైతులు
444 బస్తాల యూరియా.. రెండు వేల మంది రైతులు!