
ఎస్‌ఏలకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు
విద్యారణ్యపురి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌లలోని స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా (గ్రేడ్–2), ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ షెడ్యూల్ జారీచేశారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 10రోజుల వ్యవధిలో పూర్తికానుంది.
మల్టీజోన్–1పరిధిలో..
పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ (వరంగల్) పరిధిలో మల్టీజోన్–1 ఉంటుంది. ఈ జోన్‌లో మొత్తం 19 జిల్లాలున్నాయి. అందులో ఉమ్మడి వరంగల్ పరిధి లోని ఆరు జిల్లాలున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్ గ్రేడ్ 2 పదోన్నతులకు సంబంధించి 490 పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. విద్యాశాఖ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాలనుంచి ఖాళీలు, సీనియారిటీ జాబితా లను తెప్పించుకున్నారు. ఆయా జాబితాలను కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం వెల్లడించనున్నారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాలో 179మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్‌జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. జిల్లాలో 119మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు క్లియర్ వేకెన్సీలుండగా, 60మంది స్కూల్ అసిస్టెంట్లకు వరకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరైజింగ్ ఖాళీలు కలుపుకుని 179మందివరకు ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఈఓ కార్యాలయంలో కొద్దిరోజులుగా పదోన్నతుల ప్రక్రియకు వేకెన్సీలు, సీనియారిటీ రూపకల్పనపై కసరత్తు కొనసాగింది.
షెడ్యూల్ ఇలా..
● 2న పీఎస్, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచాలి. అలాగే.. పదోన్నతుల కోసం ఎస్‌ఏ, ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శించాలి.
● 3న ఇరువురికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది.
● 4, 5వ తేదీన సీనియార్టీలపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవీ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి.
● 6న గ్రేడ్–2 హెచ్‌ఎంల పదోన్నతి కోసం ఎస్‌ఏల కు వెబ్ ఆప్షన్ చేసుకునే అవకాశం కల్పించారు.
● 7వ తేదీన ఎస్‌ఏలకు గ్రేడ్–2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
● 8, 9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్–2 హెచ్‌ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటన చేస్తారు.
● 10న ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్, 11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన టీచర్లకు ఉత్తర్వుల కాపీలు అందిస్తారు.
ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా..
పది రోజుల్లోనే ప్రక్రియ పూర్తి
మల్టీజోన్–1 పరిధిలో
490 హెచ్‌ఎంల ఖాళీలు..