కాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట, రామాంతపూర్‌లో (ఒకటో తరగతి) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి హేమకళ గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను హెచ్‌పీఎస్ 1వ తరగతిలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలకు లక్కీ డ్రా ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తులను హనుమకొండలో అంబేడ్కర్ భవన్ ఎదుట గల జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
ప్రతీ పాఠశాలలో టైంటేబుల్ పాటించాలి
మడికొండ : ప్రతీ పాఠశాలలో ఈనెలనుంచి ఖాన్ అకాడమీ టైంటేబుల్ పాటించాలని హనుమకొండ డీఈఓ వాసంతి సూచించారు. గురువారం కాజీపేట మండలం మడికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బయోసైన్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి డీఈఓ వాసంతి హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులను పాఠ్యాంశాలను చదివించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఖాన్ అకాడమీ (జేఈఈ, నీట్, ఐఐటీ, మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కు) సంబంధించినవి అని తెలిపారు. ఎంఈఓ బండారి మనోజ్‌కుమార్, హెచ్‌ఎం సంధ్యారాణి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసు, బయోసైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేటినుంచి తల్లిపాల వారోత్సవాలు
కాజీపేట అర్బన్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా నేటినుంచి ఈనెల7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి గురువారం ‘సాక్షి’తో తెలిపారు. ఈ ఏడాది ‘తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. స్థిరమైన మద్దతు వ్యవస్థలను నిర్మించండి’ అనే థీమ్‌తో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాల్లో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బాధ్యతల స్వీకరణ
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయ నూతన కార్యనిర్వహణాధికారిగా వరంగల్ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఈఓగా పనిచేసిన శేషుభారతి పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన సునీత గతంలోను రెండు పర్యాయాలు ఈఓగా పనిచేశారు.
బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
మామునూరు : ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నేత పి.మురళీధర్‌రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెండ్రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమేందర్‌రెడ్డి, ఎం.ధర్మారావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, శిక్షణ తరగతుల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, గౌతమ్ రావు, క్రాంతికుమార్, కొండేటి శ్రీధర్, సతీష్‌రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, విజయచందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఈనెల 20వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్‌బోర్డు ఉత్తర్వులు జారీచేసినట్లు వరంగల్ డీఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ గురువారం తెలిపారు. జూలై 31వ తేదీతో అడ్మిషన్లు ముగియడంతో గడువును పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.