
దీప్తి.. ఓరుగల్లుకు ఘన కీర్తి
పర్వతగిరి: పారా అథ్లెటిక్స్‌లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల వాసి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈనెల 17వ తేదీ నుంచి జపాన్‌లో జరిగిన కోబ్–24 వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవంజి దీప్తి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించింది. ఇందులో భాగంగా ఉమెన్స్ టీ–20 కేటగిరీ 400 మీటర్ల పరుగులో కేవలం 55.07 సెకండ్స్‌లో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది. 2024 పారిస్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది. 20 ఏళ్ల వయస్సులోనే అతి పెద్ద మైలు రాయిని అందుకుని ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. కాగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన దీప్తిని పారా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గడిపెల్లి ప్రశాంత్, కోచ్ నాగపురి రమేశ్, ప్రెసిడెంట్ సింగారపు బాబు, అసోసియేషన్ బాధ్యులు అభినందించారు. దీప్తి గతేడాది పారిస్‌లో జరిగిన చాంపియన్ షిప్‌లో అమెరికాకు చెందిన బ్రెన్నాక్లార్క్ నెలకొల్పిన 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును అధిగమించింది. దీంతో పారిస్–24 పారా ఒలింపిక్స్‌కి కూడా దీప్తి క్వాలిఫై అయ్యింది. ఉత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను కుటుంబ సభ్యలు, స్నేహితులు క్రీడాభిమానులు అభినందించారు.
పారా అథ్లెటిక్స్‌లో వరల్డ్ రికార్డ్
అభినందనల వెల్లువ

దీప్తి.. ఓరుగల్లుకు ఘన కీర్తి