రెండు మండలాల్లో బ్రేక్..
ఎన్‌ఎంఈఓ–ఓఎస్ పథకం పక్కదారి?
● ఎఫ్‌పీజీల సారథ్యంలో
అమలుకు శ్రీకారం
● జిల్లాలో పదిరోజుల్లో మూడుచోట్ల నిరసనలు
● రెండు మండలాల్లో విత్తనాల
పంపిణీకి బ్రేక్ ఇచ్చిన అధికారులు
వనపర్తి: ఇప్పటికే ఉచితాలతో ఊదరగొడుతున్న ప్రభుత్వాలు.. తాజాగా నూనెగింజల ఉత్పుత్తులను పెంచాలనే లక్ష్యంతో పరిమిత రైతులకు వంద శాతం రాయితీపై నూనెగింజల విత్తనాలు పంపిణీ చేసేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఈఓ–ఓఎస్ (నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్) పథకాన్ని ప్రవేశపెట్టింది. పూర్తిగా ఉచితం అనే వరకు రైతుల్లో చాలామంది తమకు ఎందుకు అర్హత లేదంటూ నిరసనలకు దిగారు. జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. ఈ పథకాన్ని ఎక్కువగా వేరుశనగ సాగు చేసే ప్రాంతాలైన వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, పాన్‌గల్, వీపనగండ్ల, పెబ్బేరు ప్రాంతాలను ఎంపిక చేశారు. మండలాల వారీగా ఎఫ్‌పీజీ(ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్)లను ఏర్పాటుచేసి వారు ఎంపిక చేసిన రైతులకు వందశాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు అందించాలనే నిబంధన ఉంది. కాగా.. పథకాన్ని అమలు చేసే క్రమంలో రైతులు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పదిరోజుల వ్యవధిలో వనపర్తి మండలం చిమనగుంటపల్లి, అంకూరు, ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులు, రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. తమకు రాయితీ వేరుశనగ విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని కొందరి వాదన కాగా.. ఎఫ్‌పీజీ గ్రూప్‌లో లేని వారికి ఎలా ఇస్తారని మరికొందరి వాదిస్తుండటంతో సమస్య జఠిల రూపం దాల్చింది. పథకం ఉద్దేశం మంచిదే అయినా.. పూర్తిగా ఉచితం అనే వరకు వారు సూచించిన వేరుశనగ రకాన్ని సాగుచేసే యోచన లేనివారు సైతం తమకు ఇవ్వాలంటూ పట్టుబట్టడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం జిల్లాలో పంచాయితీకి దారితీస్తోంది. ఉచితంగా అందాల్సిన విత్తనాల పంపిణీపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదిరోజుల్లో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రైతులు నిరసనలకు దిగారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో అధికారులు పంపిణీకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియ, లబ్ధిదారుల జాబితా, విత్తనాల పంపిణీ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాతే తిరిగి పంపిణీ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.


