వనపర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల నిర్మూలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారులతో పాటు అంతర్గత రహదారులపై రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొత్తకోట మదర్ థెరిస్సా జంక్షన్, పెద్దమందడి మండలం బలిజపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని, రహదారి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి రాహత్ పథకం కింద గోల్డెన్ అవర్‌లో అందించే అత్యవసర వైద్యంపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టాలని, దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ తరఫున అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారుల అధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపడతామన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. సివిల్ రైట్స్‌డే, ఇతర సందర్భాల్లోనూ ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ తరఫున యాంటీ డ్రగ్ కమిటీలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఎస్పీలు బాలాజీనాయక్, గిరిబాబు, డీఆర్వో రాంరెడ్డి, సుబ్రమణ్యం, ఈడార్ మేనేజర్ మురళీకృష్ణ, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.


