చెరుకు టన్నుకు రూ.6వేల ధర చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

చెరుకు టన్నుకు రూ.6వేల ధర చెల్లించాలి

Oct 17 2026 1:04 AM | Updated on Oct 17 2026 1:04 AM

కొత్తకోట రూరల్‌: చెరుకు రైతులకు టన్నుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర నేత ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొత్తకోట మండలం అప్పరాల సమీపంలోని కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంతో రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరుకు టన్నుకు రూ.6 వేల మద్దతు ధరతో పాటు అదనంగా రూ.1,000 బోనస్‌ చెల్లించాలన్నారు. చెరుకు రవాణా, కోత ఖర్చులను ఫ్యాక్టరీ యాజమాన్యమే భరించాలని, లేబర్‌ ఖుషీ మొత్తాన్ని కూడా ఎకరాకు యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటసాగు విస్తీర్ణం కోసం రైతులకు ఎకరా రూ. 30వేల చొప్పున రుణాలు అందించాలని.. సీడీసీ నిధులతో రైతుల పొలాలకు వెళ్లే రహదారులకు మరమ్మతు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున డైరెక్టర్‌ రవికుమార్‌, రామరాజు, నాగార్జున రావు, రామ్మోహన్‌రావు, చెరుకు రైతుల సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు జీఎస్‌ గోపి, పి.తిరుమలేష్‌, ఎస్‌సీ అరుణ్‌ కుమార్‌, గోపాల్‌రెడ్డి, రైతులు శంకర్‌ నాయక్‌, స్వామి నాయక్‌, చంద్రన్న, రాజు, వెంకట్రాములు, విజయకుమార్‌ ఉన్నారు.

మట్టి వాహనాలను అడ్డుకున్న నిర్వాసితులు

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి గ్రామ పునరావాస కేంద్రానికి అతి సమీపంలో ఉన్న తేనెటిగుట్ట నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను శుక్రవారం గ్రామ నిర్వాసితులు అడ్డుకున్నారు. పునరావాస కేంద్రంలో అవసరాలకు మట్టి కావాల్సి ఉండగా.. ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండతో కొందరు మట్టి వ్యాపారులు రెండు రోజులుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని వారు ఆరోపించారు. సర్వం కోల్పోయిన తమను పట్టించుకోకుండా ఎవరికి వారు తమ వ్యాపారాలు, రాజకీయాలను కొనసాగిస్తున్నారని వాపోయారు. పునరావాస కేంద్రానికి అవసరమైన మట్టిని అందుబాటులో ఉంచిన తర్వాతే ఇతర అవసరాలకు తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, మండలంలో కొంతకాలంగా మట్టి, ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మట్టి వాహనాలను అడ్డుకున్న వారిలో రావుల నరోత్తమ్‌రెడ్డి, భీమన్ననాయుడు, సాయిలు, యాటకిరి అంజన్న, హోటల్‌ రాజు, మొగులన్న, బందెన్న ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement