పాన్గల్: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పాన్గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ శుక్రవారం కేతేపల్లి విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడించారు. అనంతరం కొల్లాపూర్ – వనపర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్యానాయక్ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో 7 నుంచి 8 గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. కరెంటు వచ్చి పోతుండటంతో పారిన మడులే మళ్లీ మళ్లీ పారుతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరాపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించారు. దీంతో ప్రధాన రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డి అక్కడికి చేరుకొని 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


