వనపర్తి: గ్రామీణ యువ క్రీడాకారుల నైపుణ్యాలు వెలికితీసేందుకు వనపర్తి చాంపియన్స్ కప్–2026 ఎంతో దోహదపడుతుందని.. జిల్లాలోని అన్ని మండలాల క్రీడాకారులతో విద్య, వయసుతో సంబంధం లేకుండా ఆటలు ఆడించాలనే కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆలోచన అభినందనీయమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి అన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి ఆయన చాంపియన్స్ కప్ క్రీడలను ప్రారంభించారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడా పతాకావిష్కరణ చేశారు. అలాగే ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, క్యారమ్స్, చెస్ పోటీలను సైతం వారు ప్రారంభించారు. మొదటగా వనపర్తి – పాన్గల్ జట్లు వాలీబాల్లో తలపడ్డాయి. కబడ్డీలో పాన్గల్ – చిన్నంబావి, ఫుట్బాల్లో అమరచింత – గోపాల్పేట్ మధ్య పోటీ జరిగింది. చదరంగం ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎత్తుకు పై ఎత్తులు వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్యారమ్స్లో ఎస్పీ సునీతారెడ్డి చక్కని ఆట తీరును కనబరిచారు. ఈ సందర్భంగా శాట్ చైర్మన్ మాట్లాడుతూ.. వనపర్తి చాంపియన్స్ కప్లో రాణించే క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం పోటీపడే అవకాశం కల్పిస్తామన్నారు. ఇక్కడి స్ఫూర్తితో సంక్రాంతికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సైతం ఇలాంటి క్రీడలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ కప్ క్రీడల్లో పాల్గొనేందుకు విచ్చేసిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటి గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. అత్యధికంగా ట్రోపీలు గెలిచిన మండలానికి చాంపియన్స్ కప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. క్రీడాకారులు మైదానంలో ఆటలాడుతున్నప్పుడు ఎన్నో మంచి విషయాలను నేర్చుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


