అన్నింటా పురుషులతో సమానంగా రాణింపు
ఆడపిల్ల అడుగుపెట్టిన ఇల్లు నందనవనం... ఆమె నవ్వు ప్రతి కష్టాన్ని మరిపించే దివ్య ఔషధం. సమాజంలో ఆడపిల్లల ఉనికి, ప్రాముఖ్యత, వారి నిస్వార్థమైన అనురాగాన్ని గౌరవించి వేడుక చేసుకోవడానికి ఏటా సెప్టెంబర్ నాలుగో ఆదివారాన్ని కూతుళ్ల దినోత్సవంగా జరుపుకొంటాం. చిన్నతనంలో ఇంటి నిండా సందడి చేస్తూ, పెద్దయ్యాక తల్లిదండ్రుల బాగోగులను ఒక తల్లిలా చూసుకునే ఏకై క రూపం కూతురు. కష్టం, సంతోషం ఏదైనా కుటుంబానికి అండగా నిలిచే ధైర్యం ఆమె. నేటి ఆధునిక కాలంలో ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విద్య, సైన్స్, క్రీడలు, రాజకీయం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. కూతుళ్లకు మనం ఇవ్వగలిగే గొప్ప కానుక కేవలం వస్తువులు, నగలు మాత్రమే కాదు.. స్వేచ్ఛ, నాణ్యమైన చదువు, సమానమైన గౌరవం, వారి కలలపై నమ్మకం. తల్లిదండ్రులు వెంటే ఉన్నారనే భరోసా ఆమెకు ప్రపంచాన్నే జయించే శక్తినిస్తుంది. కూతురి ఆశయాలకు రెక్కలు తొడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. – గోపాల్‌పేట/అమరచింత/ఆత్మకూర్/మదనాపురం/పాన్‌గల్
ఆడపిల్లలు పుట్టారని పలువురు అన్నా.. తమకు కలిగిన సంతానం మహాలక్ష్మిలని భావించి వారిని పెంచి పోషించి ఉన్నత చదువులు చదివించారు. వివరాల్లోకి వెళ్తే.. అమరచింతకు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు, పద్మావతికి ఇద్దరు కుమార్తెలు. వెంకటేశ్వర్లు సహార ఇండియా ఏజెంట్‌గా, పద్మావతి పైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించారు. పెద్ద కుమార్తె శరణ్య బీఏఎంఎస్, చిన్న కుమార్తె లావణ్య ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. శరణ్యను డాక్టర్‌కు, లావణ్యను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.తల్లిదండ్రులిద్దరూ అమరచింతలోనే స్థిరపడ్డారు. తల్లిదండ్రుల కష్టసుఖాలను గుర్తించిన కుమార్తెలు ఖర్చుల కోసం ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారు. తనకు కుమారులు లేరనే బాధ లేదని.. తన కుమార్తెలే కొడుకులని చెప్పుకొంటున్నారు ఆ తల్లిదండ్రులు.
ఆత్మకూర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది చామతోట రామేశ్వర్‌రెడ్డి, అరుణ దంపతులకు 1983, అక్టోబర్ 6న కుమార్తె హారిక జన్మించింది. కుమారుడైనా.. కూతురైనా ఒక్కటేనని బలంగా నిర్ణయించుకొని ఆమెను బీడీఎస్ చదివించారు. అనంతరం 2006, మే 14న ఆత్మకూర్‌కు చెందిన డా. పాషం ప్రణయ్‌కుమార్‌రెడ్డికు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి 2008, నవంబర్ 18న కుమార్తె ధాత్రి జన్మించగా.. వీరుకూడా ఒక్క కూతురే చాలనుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాగా చదివించి దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. లింగబేధం, వివక్ష లేకుండా తమ పిల్లలను పెంచామని ఆ దంపతులు పేర్కొంటున్నారు.
తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా..
కుటుంబానికి కొండంత అండ
నేడు కూతుళ్ల దినోత్సవం


