వనపర్తి రూరల్: అసమానతలు లేని సమాజం కోసం యువత, ప్రజలు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్‌వెస్లీ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఐద్వా కార్యదర్శి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన పుట్టా వరలక్ష్మి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్‌చౌక్ వద్ద నవ తెలంగాణ పుస్తక ప్రదర్శనశాలను ప్రారంభించారు. దేశ సంపద కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, పాలకుల విధానాలతో పేదలు నిరుపేదలుగా, కుబేరులు మరింత ధనవంతులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టా వరలక్ష్మి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీ అభివృద్ధికి, ప్రజా ఉద్యమాలకు ఎంతగానో సహకరించారని కొనియాడారు. మరణానంతరం ఆమె శరీరాన్ని పరిశోధనల నిమిత్తం వైద్య కళాశాలకు అప్పగించి కుటుంబం ఆదర్శంగా నిలిచిందన్నారు.


