వనపర్తి: చాకలి ఐలమ్మ జీవితం, ఆమె పోరాటాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, రజాకార్లు, భూస్వాముల ధౌర్జన్యాలకు ఎదురొడ్డి అణగారినవర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలు, సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. సమాజంలో అన్యాయాలు, అణిచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహిళాశక్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, ఏఓ భానుప్రకాశ్, బీసీ సంక్షేమశాఖ అధికారి ప్రమీల, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, పలువురు కౌన్సిలర్లు, ప్రజాసంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


