కూలీల కొరతతో యంత్రాలకు పెరిగిన డిమాండ్
● జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు
● జూరాల ఆయకట్టులో ముమ్మరం
యాసంగిలో వరి సాగుకు పెట్టుబడి బాగా పెరిగింది. యూరియా, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు కూలీల కొరతతో ఖర్చులు గతానికన్నా ఎకరాకు రూ.10 వేల మేర పెరిగింది. మొత్తంగా ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు అయింది.
– మైను, రైతు, నందిమళ్ల
అన్ని గ్రామాల్లో వరి కోతలు ఒకేసారి ప్రారంభం కావడంతో యంత్రాల కొరత అధికమైంది. యంత్రాలకు ఽడిమాండ్ పెరిగి యజమానులు అద్దె సైతం పెంచారు. గంటకు రూ.2,600, ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.500 చెల్లించాల్సి వస్తోంది.
– కృష్ణారెడ్డి, రైతు, అమరచింత
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వతో పాటు బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు సకాలంలో చేతికందుతున్నాయి. దీంతో రైతులు పంట కోతలకు శ్రీకారం చుట్టారు. యాసంగిలో సాగు చేసిన వరి పంటలకు తెగుళ్లు విపరీతంగా సోకడంతో వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ సకాలంలో మందులు పిచికారీ చేయడంతో పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి కోతలకు కూలీల కొరత తలెత్తడంతో యంత్రాలను వినియోగించి నూర్పిళ్లు చేపట్టి మార్కెట్‌కు తరలించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వారం నుంచి వరి కోతలు ముమ్మరం కావడంతో యంత్రాలకు డిమాండ్ పెరిగింది.
– జిల్లాలోని 14 మండలాల్లో ఈసారి యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. ఈసారి పంట నష్టాన్ని అధిగమించినా.. వ్యవసాయ కూలీల కొరత కారణంగా మరోమారు వరి కోతలకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. పనుల్లో వ్యవసాయ కూలీలు బిజీగా ఉండటంతో గ్రామాల్లో ఒక్కో కూలీకి రోజువారి 450 నుండి రూ.500 వరకు చెల్లిస్తున్న పరిస్థితులు దాపురించాయి.
జూరాల ఆయకట్టులో..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో పంట కోతల పండుగ మొదలైంది. వారబందీ విధానంలో కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే నీరు వదలడంతో వరి సాగు చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో అధికారులు వేసవిలో తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎడమ కాల్వ ఆయకట్టు 85 వేల ఎకరాలు ఉండగా.. కేవలం 20 వేల ఎకరాలు అదికూడా రామన్‌పాడ్ ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని వారబందీ విధానంలో వదలడంతో తక్కువ ఆయకట్టులో వరి సాగైంది.


