సంక్షేమ వారోత్సవాలు ఘనంగా చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ వారోత్సవాలు ఘనంగా చేయాలి

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు అన్ని సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో నిర్దేశించిన ప్రత్యేక కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన వసతిగృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలను తనిఖీ చేసి వంటగది శుభ్రత, ఇతర స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మెస్‌ కమిటీలు యాక్టివ్‌గా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలని, స్టాక్‌ రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా చూడాలని సూచించారు. అదేవిధంగా వంట సరుకుల గడువు ముగింపు తేదీని పరిశీలించాలన్నారు. సూపర్‌వైజర్‌ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. భవనాల మరమ్మతులు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంపించిన గూగుల్‌ ఫామ్‌లో నమోదు చేయాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు విద్యార్థులకు టాలెంట్‌ ఫెస్టివల్‌ పేరుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. మూడోరోజు వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. నాలుగోరోజు విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి ప్రభుత్వం అమలు చేస్తున్న సౌకర్యాలపై వివరించాలన్నారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ..

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను సోమవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీంకు సంబంధించిన వాల్‌పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వినోద్‌కుమార్‌, ఎన్‌.ఖీమ్యానాయక్‌, జెడ్పీ సీఈఓ యాదయ్య, హౌసింగ్‌ పీడీ విఠోబా, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోరాటయోధుడు బసవేశ్వరుడు..

సమాజంలో మూఢ నమ్మకాలు బలంగా ఉన్న రోజుల్లో తన బోధనలతో ప్రజలను కాపాడిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. లింగాయత ధర్మం స్థాపించి చిరుప్రాయంలోనే శివపురాణం గాధలను అవగతం చేసుకున్న మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్‌, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement