ఇందిరమ్మ ఇళ్లకు రుణ సదుపాయం
వనపర్తి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో 13 ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయని, రెండు ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం శ్రీరంగాపురం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలని.. గరిష్టంగా 10 రోజుల్లో భవనాన్ని అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను సందర్శించి యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ బోర్డుపై నిల్వలు, సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, పారదర్శకంగా పంపిణీ జరగాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజు, రమేష్‌రెడ్డి, హౌసింగ్ డీఈ విఠోబా, ఎంపీడీఓ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


