సర్పంచ్‌లు బాధ్యతగా మెలగాలి
వనపర్తి: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాల్లో బాధ్యతగా మెలిగి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం రాజపేట శివారు వైటీసీ భవనంలో సర్పంచ్‌ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. సర్పంచ్‌లకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న అన్ని అంశాలను వివరిస్తారని.. తమ విధులు తెలుసుకొని సమర్థవంతంగా పని చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి తాను ఎప్పుడు సహకరిస్తానని చెప్పారు. ఇదివరకు సర్పంచ్‌గా పనిచేసిన వారితో కాసేపు మాట్లాడించి వారి అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లకు కలెక్టర్ శిక్షణ సామగ్రిని పంపిణీ చేశారు. సమావేశంలో డీపీఓ తరుణ్, డీఎల్‌పీఓ రఘునాథ్, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సజావుగా ఇందిరమ్మ చీరల పంపిణీ..
జిల్లాలోని ఐదు పురపాలికల్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సోమవారం నుంచి ఇందిరమ్మ చీరలు, మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. పురపాలికలకు ఇప్పటికే 32 వేల పైచిలుకు ఇందిరమ్మ చీరలు రాగా.. వార్డుల వారీగా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ ఉమాదేవి, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌లు బాధ్యతగా మెలగాలి


